బ్రాహ్మణ సంఘాల డిమాండ్
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ అర్చకులపై ఇష్టానుసారంగా దుర్భాషలాడి వారి మనోభావాలను దెబ్బతీసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు వ్యవహార శైలిపై కూటమి ప్రభుత్వం విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, పల్నాడు జిల్లా సమాఖ్య, బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిత్యం దైవ కార్యక్రమాలు నిర్వహించే బ్రాహ్మణులపై ఎమ్మెల్యే హోదాలో అనుచిత వ్యాఖ్యలు చేయటం డాక్టర్ అరవిందబాబుకు తగదన్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
నరసరావుపేట రూరల్: భారతదేశ తొలి ఉపప్రధానిగా, హోం మంత్రిగా, దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ జగదీష అదహళ్లి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ జయంతిని శనివారం నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం అనేక సంస్థానాలను దేశంలో విలీనం చేసి దేశ సమైఖ్యతకు పునాది వేశారని తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యత, సమైఖ్యతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి, అధికారులు పాల్గొన్నారు.
గురజాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురజాల మండలం చల్లగుడిపాడు గ్రామానికి చెందిన సీహెచ్.చౌడేశ్వరరావు (37) గురజాలలోని డెకరేషన్ పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా, వెనుక నుంచి వాహనం ఢీకొంది. ప్రమాదంలో చౌడేశ్వరరావు తలకు తీవ్రగాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.
నరసరావుపేట టౌన్: అర్ధరాత్రి వరకు మద్యం విక్రయిస్తున్న దుకాణాన్ని మూసేయాలని సూచించిన హెడ్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి పాల్పడిన జనసేన నేతపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వలి శుక్రవారం రాత్రి నైట్ రౌండ్ విధుల్లో భాగంగా పల్నాడు రోడ్డుకు వెళ్లాడు. రాత్రి 11 గంటలైనా ఆర్‌కే వైన్ షాప్ తెరిచి ఉంచి మద్యం విక్రయిస్తు ఉండటాన్ని గమనించాడు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా రాత్రి 10 గంటల వరకే మద్యం విక్రయాలకు అనుమతి ఉందని ఇప్పటివరకు దుకాణం ఎందుకు తెరిచారని, మూసేయాలని దుకాణ నిర్వాహకుడికి సూచించారు. విషయం తెలుసుకున్న మద్యం దుకాణ యజమాని, జనసేన నేత శ్రీనివాసరావు అక్కడకు వచ్చి విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. దుకాణం మూయనని, ఏం చేస్తారో చేసుకోమని దురుసుగా సమాధానం చెప్పాడు. విషయం ఉన్నతాధికారులకు తెలియటంతో వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు.
జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి
గుంటూరు వెస్ట్: కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదుకు నవంబర్ 6 చివరి తేదీగా నిర్ణయించబడినందున, గడువులోగా అర్హులైన ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సంబంధించిన అర్హతలపై ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పించాలని, మండలాల వారీగా అర్హులైన ఉపాధ్యాయులను గుర్తించి, వారందరికీ సమాచారం చేరవేసి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు సూచించారు.


