స్నేహితుల మధ్య వివాదమే మృతికి కారణమా?
మృతిపై పలు సందేహాలు
మంగళగిరి రూరల్: మంగళగిరి మండలం నవులూరు ఎన్టీఆర్ కాలనీలో గుర్రం నరసింహస్వామి (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితులతో కలిసి శుక్రవారం రాత్రి బయటకు వెళ్లిన యువకుడు తీవ్ర గాయాలతో ఇంటికి చేరి, శనివారం ఆసుపత్రిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. నరసింహస్వామికి స్నేహితులతో కలిసి మద్యం సేవించే అలవాటు ఉంది. గతరాత్రి స్నేహితులు అతడిని తమ వెంట తీసుకెళ్లి, కొంత సమయం తరువాత తీవ్ర గాయాలైన స్థితిలో ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు వేసుకున్న దుస్తులు కాకుండా వేరే దుస్తుల్లో ఉండటంతో ఏమైందని ప్రశ్నించగా బురదలో కింద పడిపోయాయని దుస్తులు మార్చామని తెలిపారు. రాత్రి సమయంలో శరీరం వేడిగా ఉండటాన్ని గమనించి వెళ్లి చూడగా, అతడు సృహలో లేకుండా ఉన్నాడు. ఒంటినిండా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఉదయం మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తన కుమారుడి మృతికి అతడి స్నేహితులే కారణమని ఆరోపిస్తూ, నమ్మకంగా తీసుకెళ్లి గాయాలపాలు చేసి ఇంటి వద్ద వదిలివెళ్లిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. నరసింహస్వామి సీసీ కెమెరాల ఏర్పాటు, మరమ్మతుల పనులు చేస్తూ జీవనం సాగించేవాడని తెలిపారు. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుల మధ్య వివాదానికి మద్యం, గంజాయి వినియోగం కారణమై ఉండవచ్చని స్థానికంగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


