ఓటమి భయం.. కుట్రల పర్వం | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయం.. కుట్రల పర్వం

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

ఓటమి భయం.. కుట్రల పర్వం

మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఏజెంట్లే లేకుండా అడ్డుకున్న టీడీపీ గూండాలు వినుకొండలో 14 మంది ముస్లిం యువకులపై అక్రమ కేసులు పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించిన ముస్లిం మహిళలు.. కనికరించని ఖాకీలు చిలకలూరిపేటలో దౌర్జన్యాలకు దిగాలంటూ పుల్లారావు పిలుపు సత్తెనపల్లిలో ఏజెంట్లపై అక్రమ మద్యం కేసు నమోదు.. అరెస్టు ఓటమి భయంతో దౌర్జన్యాలకు దిగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు

అల్లర్లు సృష్టించేందుకు పథక రచన

ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అధికార మదంతో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు.. వారికి ఊడిగం చేస్తున్న ఖాకీల కర్కశత్వంతో జిల్లాలో అరాచకం రాజ్యమేలుతోంది. నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం దగ్గర్నుంచి బీఫారాలు చించివేయడం, ఆర్వోలను అడ్డుపెట్టుకుని స్క్రూటినీలో తొలగించడం, అక్రమ కేసులు బనాయించి విత్‌డ్రాలు చేయించడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇన్ని అడ్డంకులను దాటుకుని ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఎదుర్కోలేక, ఓటమి భయంతో పోలీసులను అడ్డుపెట్టుకుని పోలింగ్‌ రోజు కూడా దౌర్జన్యాలకు, దాడులకు తెగబడేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు కుట్రలు పన్నుతున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో నవంబరు ఒకటో తేదీన పల్నాడు జిల్లాలోని మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ మున్సిపాలిటీలతోపాటు గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి, బాపట్ల జిల్లాలోని రేపల్లె, చీరాల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో పల్నాడు జిల్లాలో జరిగే నాలుగు మున్సిపాలిటీల పరిధిలో అధికార పార్టీ నేతలు.. ఎన్నికల అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని అన్ని కుట్రలకు తెరతీశారు. జిల్లాలో ఈ స్థాయిలో దౌర్జన్యాలు, అరాచకాలు జరుగుతున్నా పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాగానీ, జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లిగానీ అధికార పార్టీకి కొమ్ముకాశారే తప్ప, ఎక్కడా ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపేందుకు ప్రయత్నం కూడా చేయలేదనే విషయం సుస్పష్టం. ఎన్నికల సంఘానికి వీడియోలు చూపించుకోవడానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల చివరి రోజు కొందరు డమ్మీ అభ్యర్థులకు మాత్రమే పోలీసుల సహాయంతో నామినేషన్లు వేయించారు.

కుట్రతో ఏజెంట్లు లేకుండా చేసి...

మాచర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థితోపాటు 36 వార్డులకు వైఎస్సార్‌ సీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఏ ఒక్కరూ విత్‌డ్రా చేసుకోకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఓటమి తప్పదని భయపడ్డ టీడీపీ ఎమ్మెల్యే... బీఫారాలు సమర్పించడానికి వెళ్లిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై అప్పటికే మాటువేసి ఉన్న టీడీపీ గూండాలతో దాడి చేయించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బీఫారాలు చించి వేయించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి నిరసన తెలిపినప్పటికీ, ఆయనపైనే కేసులు పెట్టారు. స్వతంత్ర అభ్యర్థుల్లా బీరువా గుర్తుతో పోటీకి సమాయత్తమయ్యారు. ఓటమి తప్పదని భావించిన టీడీపీ నేతలు... పోలింగ్‌ రోజు బూత్‌లలో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లే లేకుండా చేయాలనే కుట్రకు పాల్పడ్డారు. మున్సిపల్‌ కమిషనర్‌ వేణుబాబు ఎన్నికల అధికారులతో అభ్యర్థులకు ఫోన్లు చేయించారు. వారు వచ్చే సమయానికి టీడీపీ గూండాలను తన చాంబర్‌ వద్ద ఉంచుకుని తిరిగి దాడి చేయించి ఏజెంట్ల ఫారాలు చించివేశారు. దీంతో వైఎస్సార్‌ సీపీకి ఏజెంట్లే లేకుండా పోయారు.

పోలింగ్‌ను అడ్డుకునేందుకు ప్రణాళికలు

వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు జరుగకుండా గొడవలు సృష్టించే కుట్రకు టీడీపీ నేతలు తెరతీశారు. వైఎస్సార్‌ సీపీకి బలంగా నిలబడే 14 మంది ముస్లిం యువకులపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధించారు. దీనిపై గురువారం రాత్రి నుంచి తెల్లవారే వరకు ముస్లిం మహిళలంతా స్టేషన్‌ ఎదుట దర్నా చేపట్టినా, పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వారిని విడిచిపెట్టలేదు. ముఖ్యంగా పట్టణ సీఐ ప్రభాకర్‌ పచ్చచొక్కా వేసుకున్న కార్యకర్తలా మారి వైఎస్సార్‌ సీపీ నేతలు, అభ్యర్థులు, ఏజెంట్లను స్టేషన్‌లకు పిలిచి నేరుగా బెదిరిస్తున్నారు. వినుకొండలో ఆర్యవైశ్యులకు టీడీపీ చైర్మన్‌ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని ఆశ చూపి మోసం చేయడంతో వారంతా వైఎస్సార్‌ సీపీకి ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వారిని ఓటింగ్‌కు రాకుండా చేయాలనే కుట్రలు పన్నుతున్నారు.

మద్యం పేరుతో అక్రమ అరెస్టులు

సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కుట్రలకు తెగబడ్డ టీడీపీ నేతలు... పోలింగ్‌ రోజు మాత్రం పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌ సీపీ నేతలను ఇబ్బందులకు గురిచేసేందుకు పథకం పన్నారు. గురువారం రాత్రి 12వ వార్డులో బూత్‌ ఏజెంట్లుగా ఉన్న వారిపై అక్రమంగా మద్యం కేసు నమోదు చేసి, రాత్రికి రాత్రే నిర్బంధించారు. వాళ్లే మద్యం సీసాలు పెట్టి పోలీసులకు సమాచారం అందించినట్లుగా డ్రామాలు ఆడి ఏజెంట్లను తప్పుడు కేసుల్లో ఇరికించారు. వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకునేలా టీడీపీ ఒత్తిడి తెస్తోంది.

చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను బెదిరించి, ఆర్వోలపై ఒత్తిడి చేసి ఉపసంహరణ రోజు అర్ధరాత్రి వరకు 16 మందితో విత్‌డ్రా చేయించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థిని సైతం బెదిరించి కండువా కప్పి తమ పార్టీలో చేర్చుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... ఇప్పుడు పోలింగ్‌ రోజు గొడవలు సృష్టించాలంటూ ఏకంగా తమ కేడర్‌కు పిలుపునివ్వడం చూస్తుంటే ఏ స్థాయిలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. పోలీసులను ఉపయోగించి పోలింగ్‌ రోజు 12 గంటల వరకు క్యూల్లో టీడీపీ కార్యకర్తలే ఉండేలా చూసి, ఆ తర్వాత వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బయటకు లాగేసి అల్లర్లు సృష్టించేందుకు పథక రచన చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, వారిని ఉపయోగించుకోండంటూ కేడర్‌కు పిలుపునివ్వడం చూస్తుంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతోంది. ఇంత చేసినా ఎన్నికల్లో అధిక శాతం వార్డులను వైఎస్సార్‌ సీపీ గెలిస్తే పరువు పోతుందనే భయంతో, ఎన్నికల రోజు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను బయటకు రానీయకుండా చేయాలంటూ పోలీసులకు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement