ప్రలోభాలకు ‘పచ్చ’ పన్నాగం | - | Sakshi
Sakshi News home page

ప్రలోభాలకు ‘పచ్చ’ పన్నాగం

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

ఓటర్లను ఆకట్టుకునేందుకు కూటమి నేతల తాయిలాలు ఓటుకు రూ.1,500 నుంచి రూ. 2 వేల వరకు పంపిణీ ఏరులై పారుతున్న మద్యం ముగిసిన ఎన్నికల ప్రచారం రేపు నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు

ఆ వార్డుల్లో మరింత జోరుగా..

జిల్లాలోని చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో టీడీపీ నాయకులు, అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ప్రధానంగా మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులు, వార్డు కౌన్సిలర్‌ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 2 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ‘ఓటు మాకు వేయండి .. మీకేం కావాలో చెప్పండి’ అని ఆఫర్‌ ఇస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా డబ్బుతో పాటు మద్యం, బహుమతులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

సత్తెనపల్లి: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌ డౌన్‌ మొదలైంది, పోలింగ్‌కు మరో 24 గంటల గడువు మాత్రమే ఉండడంతో ఇక రాజకీయ సీన్‌ రసవత్తరంగా మారబోతోంది. ఓటర్లే లక్ష్యంగా కూటమి నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ వారి మద్దతు కూడా కట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు బహిరంగ ప్రచారంతో హోరెత్తించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇక ఇళ్లవారీగా ఓట్లపై ప్రత్యక్షంగా దృష్టి పెడుతున్నారు. అధికార పార్టీకి ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు అనుమతులు ఇస్తున్న పోలీసులు... వైఎస్సార్‌ సీపీకి మాత్రం ఆంక్షలు విధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వినుకొండలో శుక్రవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ర్యాలీ, రోడ్‌షోకు కూటమి అనుమతులు తీసుకొని మధ్యాహ్నం 2 గంటలు దాటే వరకు నిర్వహించింది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించినా పోలీసులు చోద్యం చూశారనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియడంతో అంతర్గత ప్రచారంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

ప్రలోభాల పర్వం ఇలా...

నాకు ఓటు వేయండి .. అంటూ ప్రత్యక్షంగా కలిసి దండం పెడుతూ ప్రార్థించిన అభ్యర్థులు ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రలోభాల పర్వం షురూ చేశారు. అత్యధిక వార్డుల్లో ఓటుకు రూ.1,500 నుంచి రూ. 2 వేలు వరకు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. వినుకొండలో ఒక అభ్యర్థి చైర్మన్‌తో పాటు తన స్థానానికి కలుపుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. వినుకొండ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉంటే చైర్మన్‌ పదవిని ఆశించి సమీకరణల్లో భాగంగా త్రుటిలో తప్పిపోయినప్పటికీ చైర్మన్‌ అభ్యర్థి కయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని వైస్‌ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న ఓ వార్డుకు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి రూ. 3 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అభ్యర్థి తన కౌన్సిలర్‌ పదవి కోసం ఓటుకు రూ.3 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మాచర్ల మున్సిపాలిటీలో ఓటుకు రూ. వెయ్యి చొప్పున కూటమి నేతలు పంపిణీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. సత్తెనపల్లిలో ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవం కోసం రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఇక్కడ 35 వార్డులకు పోటీ జరుగుతుండగా... కొన్ని వార్డుల్లో రూ.వెయ్యి చొప్పున, బలమైన పోటీ ఉన్న చోట్ల రూ.1,500 చొప్పున ఓటరుకు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చిలకలూరిపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని జనసేనకు కేటాయించటంతో ఆచి తూచి ఖర్చు చేస్తున్నారని సమాచారం. కౌన్సిలర్‌ స్థానాలకు పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులు ఇక్కడ కూడా ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు వార్డుకు మూడు నుంచి ఐదు కేసులు మద్యం పంపిణీ చేస్తున్నారు. మాచర్ల వార్డుకు 10 కేసులు చొప్పున మద్యం పంపిణీ జరుగుతోందని బహిరంగ ప్రచార నడుస్తోంది. వైన్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు అధికార పార్టీ వారివే కావడంతో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నారు. బిర్యానీ ప్యాకెట్లుతోపాటు మహిళలకు గిఫ్ట్‌లు, చీరలు వంటివి ఇస్తున్నారు. ప్రలోభాల పర్వంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా అధికార పార్టీ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.

పోటీ అధికంగా ఉన్న కొన్ని వార్డుల్లో ఓటుకు రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం ఉంది. తాజా మాజీ కౌన్సిలర్లు, పార్టీ పరంగా టిక్కెట్లు దక్కక స్వతంత్రులుగా బరిలో నిలిచిన అభ్యర్థులు, ఆయా పార్టీల నుంచి వైస్‌ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నవారు, కుల సంఘాల నేతలను పట్టుకొని గంపగుత్తగా ఓట్లు ఉన్న నేతలకు డబ్బుల పంపిణీలో అసలు వెనుకాడటం లేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement