వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులతో ఎంపీ లావు నామినేషన్లు వేయించాలి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులతో ఎంపీ లావు నామినేషన్లు వేయించాలి

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

విలేకర్ల సమావేశంలో డాక్టర్‌ గోపిరెడ్డి

నరసరావుపేట: జరగబోయే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసే నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులతో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్లు వేయించాలని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు భద్రత కల్పిస్తామన్న వైఎస్సా ర్‌సీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు ముందుకు రాలేదని, ఆ పార్టీ నాయకులు ఎన్నికలకు సిద్ధంగా లేరని తనతో చెబుతున్నారంటూ ఎంపీ లావు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఆయన మాటల్లో ఎటువంటి వాస్తవంలేదని డాక్టర్‌ గోపిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడారు. అక్రమ హౌస్‌ అరెస్టు నుంచి తప్పించుకొని తాను రొంపిచర్ల అభ్యర్ధులచేత ఈనెల 22న నామినేషన్లు వేయించేందుకు చేసిన ప్రయత్నంలో పోలీసులు, టీడీపీ గుండాలు కలిసి అడ్డుకున్నారని, ఆసమయంలో మరుసటి రోజు స్వయంగా తామే నామినేషన్లు వేయిస్తామంటూ ఎస్‌పీ చేత డీఎస్పీ హనుమంతరావు తనకు హామీ ఇచ్చారన్నారు. నామినేషన్ల చివరిరోజున తమ అభ్యర్ధులు అంతా సిద్దమై నామినేషన్లు వేసేందుకు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వేచి ఉండగా తాను డీఎస్పీకు ఫోన్‌చేయగా సాయంత్రం 4.20లకు వచ్చి పోలీసుల భద్రత మధ్య కేవలం రొంపిచర్ల అభ్యర్ధులను మాత్రమే తీసుకెళతానని, బయట టీడీపీ హంగామా ఎక్కువగా ఉందని, వారు రాళ్లు విసిరితే తనకు సంబంధం లేదని చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వాస్తవాలు ఇలా ఉంటే వైఎస్సార్‌సీపీ వారికి పోటీచేసేందుకు ఆసక్తిలేదంటూ ఎంపీ లావు తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. ఎంపీటీసీలను వదిలేసి కేవలం జెడ్పీటీసీలచేతనే నామినేషన్లు వేయిస్తామంటూ ఆర్‌డీఓ ఫోన్‌ చేశారని, ఎంపీటీసీలు లేకుండా జెడ్పీటీసీలు నామినేషన్లు వేసి ఏవిధంగా పోటీలో ఉంటారని నిలదీశారు. ఇదంతా కావాలని టీడీపీ నాయకులు, అధికారులు కలిసి ఆడిన నాటకమని పేర్కొన్నారు. గ్రానైట్‌ క్వారీల నుంచి వందలాదిమంది బీహారీలు, ఒరిస్సాలకు చెందిన వారిని తీసుకొచ్చి ఒక్కొక్కరికి రూ.2వేలు, మద్యం పోసి కర్రలు, రాళ్లు ఇచ్చి నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వారిపై పోలీసుల సమక్షంలోనే నామినేషన్‌ కేంద్రాల వద్దనే దాడిచేసి రక్తపు గాయాలయ్యేలాగా కొట్టి నామినేషన్‌ పత్రాలు లాక్కొని చించేశారన్నారు. వాస్తవం ఇలా ఉంటే జరిగిన సంఘటనలపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఎంపీ లావుతో పాటు టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.

కోట్లు ఆర్జిస్తున్న టీడీపీ నాయకులు

ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధులను దుర్మార్గంతో నామినేషన్లు వేయనీయకుండా చేసి టీడీపీ అభ్యర్థులను ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బలవంతపు ఏకగ్రీవాలు చేయటం ద్వారా టీడీపీ ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు కోట్లు ఆర్జించారన్నారు. ఒక్కో ఎంపీటీసీ అభ్యర్థి నుంచి రూ.5లక్షలు, జెడ్పీటీసీ అభ్యర్ధి నుంచి రూ.10 లక్షలు చొప్పున వసూలు చేశారన్నారు. ఎంపీపీ అభ్యర్ధి నుంచి రూ.10లక్షలు వసూలు చేశారన్నారు. అలాగే జరగబోయే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలను కూడా తమ పార్టీ వారిని నామినేషన్లు వేయనీయకుండా చేసి బలవంతంగా ఏకగ్రీవాలు చేసినందుకు సర్పంచ్‌ అభ్యర్ధుల నుంచి రూ.10లక్షలు వసూలు చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement