వినుకొండలో కూటమి మార్కు అరాచకం | - | Sakshi
Sakshi News home page

వినుకొండలో కూటమి మార్కు అరాచకం

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

వినుకొండ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అధికార కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా కోఆర్డినేటర్‌ పూనూరు గౌతమ్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వినుకొండలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు ఖాకీ చొక్కాల వెనుక పచ్చ చొక్కాలు ధరించి, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్‌ల డైరెక్షన్‌లో ఎన్నికల వ్యవస్థను తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలంటే ఎందుకు ఇంత భయం....

శాసనసభ ఎన్నికల్లో 164 సీట్లు గెలుచుకున్నామని గొప్పలు చెప్పుకునే కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు అనగానే వణుకు పుడుతోందని గౌతమ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘సూపర్‌ సిక్స్‌‘ పేరుతో అలవిగాని హామీలిచ్చి ఓట్లు దండుకున్న కూటమి, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా నిత్యవసర ధరలను కూడా అదుపు చేయలేకపోయిందన్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకతను చూసి ఓటమి భయంతోనే పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

పోలీసుల అధికార దుర్వినియోగం

వినుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నేతృత్వంలో 36 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ ఎంతో బలంగా ఉందని, ఇది జీర్ణించుకోలేక స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పోలీసు వ్యవస్థను దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండ టౌన్‌ సీఐ బి. ప్రభాకర్‌ రావు పూర్తిగా టీడీపీ ఏజెంట్‌గా మారిపోయారని, సంబంధం లేని కేసుల్లో 27 మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించారని దుయ్యబట్టారు.

ఖాకీ చొక్కాల వెనుక పచ్చ రాజకీయం:

మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ... మద్యం మత్తులో ఇద్దరు డ్రైవర్లు గొడవ పడితే, రాత్రికి రాత్రే దాన్ని వైఎస్సార్‌ సీపీపైకి తోసేసి రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ముస్లిం మైనార్టీ మహిళలను కూడా పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిప్పడం ఖాకీల రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. ఈ అక్రమాలను ప్రజలు ఓటు రూపంలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిశీలకులు బాసు లింగారెడ్డి, లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ రాళ్ల మాధవి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భయంతోనే ఇటువంటి కుట్రలు చేస్తున్నారని, రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పి.ఎస్‌. ఖాన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎం.ఎన్‌. ప్రసాద్‌, అమ్మిరెడ్డి మల్లికార్జున రెడ్డి, రామాంజరెడ్డి, నాగూల్‌ మీరావాలి పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా కోఆర్డినేటర్‌ పూనూరు గౌతమ్‌ రెడ్డి ధ్వజం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement