వినుకొండ: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 27 మంది కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. గురువారం సాయంత్రం పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో ఇద్దరు ప్రచార వాహనాల డ్రైవర్ల మధ్య వ్యక్తిగత గొడవ జరిగింది. అయితే ఈ చిన్న వివాదాన్ని ఆసరాగా చేసుకుని పోలీసులు 14 మంది యువకులు దాడికి పాల్పడినట్లు కేసులు నమోదు చేశారని బాధితులు ఆరోపించారు. పాత బైండోవర్ కేసులలో సంతకాలు చేసి వెళ్లాలని పిలిపించిన పోలీసులు, తీరా స్టేషన్‌కు వచ్చాక కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న బాధిత కార్యకర్తల కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ నాయకులు గురువారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీస్ స్టేషన్ ముందే కాపలా కాశారు.
పోలీసుల హైడ్రామా ...
అక్రమ అరెస్టుపై పెద్ద ఎత్తున నిరసన రావడం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టటం వంటి ఘటనలు నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నంలోగా అందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఏ కేసు కింద అరెస్టు చేశారో స్పష్టత ఇవ్వకుండా, కోర్టుకు హాజరుపరచకుండా పోలీసులు తీవ్ర హైడ్రామా నడిపారు.
బాధితులకు లీగల్ సెల్ భరోసా...
సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా వైఎసార్ సీపీ లీగల్ సెల్ కన్వీనర్ రోళ్ల మాధవి వినుకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని, వెంటనే కార్యకర్తలను విడుదల చేయాలని అధికారులను కోరారు. అనంతరం స్టేషన్ వద్ద ఆందోళనలో ఉన్న మహిళలను, బాధిత కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. పార్టీ కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. చట్టపరంగా అన్ని విధాలా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.


