నరసరావుపేట రూరల్: దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి తెలిపారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరిచంకుని శుక్రవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి నివాళి అర్పించి మాట్లాడారు. ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో వల్లభాయ్ పటేల్ అసాధారణమైన సంకల్పం, దూరదృష్టి, సమర్ధవంతమైన నాయకత్వంతో 560కు పైగా సంస్ధానాలను భారత్ యూనియన్‌లో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. దేశాన్ని భౌగోళికంగా ఒక తాటిపైకి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. అనంతరం పోలీసు సిబ్బంది ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఐక్యతా పరుగును జిల్లా ఎస్పీ ప్రారంబించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి గడియారస్తంభం సెంటర్, పల్నాడు బస్టాండ్, పాత చెక్ పోస్ట్ సెంటర్ మీదగా జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుంది. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి, ఏఆర్ డీఎస్పీ గాంధీ రెడ్డి, ట్రాఫిక్ సీఐ లోకనాధం, ఏఆర్ ఆర్‌ఐలు కృష్ణ, గోపినాథ్ పాల్గొన్నారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి


