కీలక నామినేటెడ్ పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం టీడీపీలోని ఇతర సామాజికవర్గాల నేతల తీవ్ర అసంతృప్తి పార్టీ కోసం శ్రమిస్తున్న తమకు మొండిచేయి చూపారని ఆవేదన ఆర్థిక బలమే అర్హతగా మారిందంటూ మండిపాటు ఇక సామాజిక న్యాయమెక్కడంటూ అధిష్ఠానంపై ఆగ్రహం
కనిపించని
సామాజిక న్యాయం
ఏ పదవి చూసినా...
నరసరావుపేట టౌన్: అధికారంలోకి రావడానికి అందరూ కలిసి పనిచేయాలి.. ఎన్నికల సమయంలో ప్రతి సామాజిక వర్గం ఓట్లు కావాలి.. జెండాలు మోసేందుకు, ప్రచారం చేసేందుకు, జనసమీకరణకు ప్రతి కార్యకర్త అవసరం.. కానీ పదవుల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులపై ఇప్పుడు ఇదే ప్రశ్న ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కీలకమైన రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యమున్న పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసిన ఇతర సామాజిక వర్గాల నాయకుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పదవులకు పనికిరారా?
ఎన్నికలకు ముందు పార్టీ నాయకత్వానికి అండగా నిలిచినవారు.. గెలుపే లక్ష్యంగా పనిచేసినవారు.. తమ నాయకుడిని గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసినవారు.. ఇప్పుడు పదవుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసినవారికి అవకాశాలు ఇవ్వకపోతే, భవిష్యత్తులో కార్యకర్తలు ఎలా పనిచేస్తారని ఆ పార్టీ నాయకులే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అర్హతలు, అనుభవం, సేవలు, సామాజిక ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డబ్బుంటేనే పదవులు
పార్టీలో పదవులు దక్కాలంటే ప్రజల్లో బలం, పార్టీ పట్ల నిబద్ధత, దీర్ఘకాలిక సేవలు ముఖ్యమా? లేక ఆర్థికంగా బలంగా ఉన్నవారికే ప్రాధాన్యం లభిస్తోందా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. టీడీపీలో ఆర్థికంగా బలమైన నాయకులకు కీలక పదవులు దక్కుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్య కార్యకర్తల రాజకీయ భవిష్యత్తుపై అది తీవ్ర ప్రభావం చూపుతోంది.
2024 ఎన్నికలకు ముందు పార్టీ గెలుపు కోసం అన్ని సామాజిక వర్గాల నాయకులు, కార్యకర్తలు పనిచేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేశామని పలువురు నేతలు చెబుతున్నారు. అయితే ఎన్నికల అనంతరం పదవుల పంపిణీలో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలతో పాటు పలు కీలక పదవుల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యం లభించిందన్న చర్చ సాగుతోంది. జీడీసీసీ చైర్మన్, గ్రంథాలయ సంస్థల చైర్మన్, సాగర్ కుడికాలువ చైర్మన్, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ వంటి పదవుల విషయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఇన్ని కీలక పదవులు ఒకే సామాజిక వర్గం నేతలకు దక్కాయన్న అభిప్రాయం ఉండగా.. ఇప్పుడు పల్నాడు జిల్లా పరిషత్ చైర్మన్, గుంటూరు నగర మేయర్ పదవులు కూడా అదే వర్గానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం మరింత చర్చకు దారితీస్తోంది. పదవుల పంపిణీలో సామాజిక సమతుల్యత ఎక్కడనే ప్రశ్న తెరపైకి వస్తోంది.
సామాజిక న్యాయం అంటే ఎన్నికల సమయంలో అన్ని వర్గాల మద్దతు కోరడమే కాదు.. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయా వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం. ఒకే సామాజిక వర్గానికి వరుసగా కీలక పదవులు దక్కుతున్నాయన్న భావన బలపడితే, మిగిలిన వర్గాల్లో అసంతృప్తి పెరగడం సహజం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయంగా కీలకమైన పదవులు, ఆర్థికంగా ప్రాధాన్యమున్న సంస్థల బాధ్యతలు, స్థానిక సంస్థల పీఠాల కేటాయింపుల్లో సామాజిక సమతుల్యత ఎంతవరకు పాటిస్తున్నారన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.


