నరసరావుపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నవంబర్ ఒకటో తేదీన జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు మూడో తేదీన జరుగుతుందని తెలిపారు. ప్రజలందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి కోరారు.
31న సెలవు
నరసరావుపేట: జిల్లాలోని మునిసిపల్ ఎన్నికల పోలింగ్ నవంబర్ ఒకటో తేదీన జరగనున్న నేపథ్యంలో ఈ నెల 31వ తేదీన సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఎన్నికల సంఘం స్థానిక సెలవు ప్రకటించినట్లు చెప్పారు. ఎన్నికలు నిర్వహించనున్న ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్లు వివరించారు. పోలింగ్‌కు ముందు రోజు, ఓట్ల లెక్కింపు రోజున అంటే అక్టోబర్ 31న, నవంబర్ రెండో తేదీన పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగిస్తున్న అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాలు, ఇతర భవనాలలోని కార్యాలయాలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పరిశీలన
మాచర్ల: పట్టణంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం పర్యటించారు. పురపాలక సంఘ కార్యాలయంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు. దాదాపు గంటపాటు అక్కడే ఉంది అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాధారణ పోలింగ్ సక్రమంగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అనంతరం కిడ్స్ పాఠశాలలోని ఎన్నికల స్ట్రాంగ్ రూంతోపాటు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు, తహసీల్దార్ కిరణ్‌కుమార్, అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని ఏఎంజీ సంస్థలో ఏర్పాటు చేసిన ఎన్నికల స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ హాల్‌ను పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి బుధవారం రాత్రి పరిశీలించారు. కౌంటింగ్ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత, పోలీసు బందోబస్తు, ఎన్నికల సామగ్రి పరిరక్షణకు తీసుకున్న చర్యలను అధికారులతో కలిసి తెలుసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, అర్బన్ సీఐ పి.రమేష్, ఎస్‌ఐలు, ఎన్నికల, పోలీసు సిబ్బంది ఉన్నారు.


