నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ చెక్‌పోస్టుల వద్ద వాహనాలను ఎస్‌ఎస్‌టీ పోలీస్ బృందాలతో తనిఖీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా నగదు, మద్యం వంటి వాటి రవాణాను కట్టడి చేసేందుకు చెక్‌పోస్టుల వద్ద నిఘా కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని స్పష్టం చేశారు. స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం ఈవో దాసరి చంద్రశేఖరరావు సమక్షంలో దేవాలయంలో ఉన్న 13 హుండీలను తెరిచారు. అందులో ఉన్న నగదును భక్తులచే లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో సైదమ్మబాయి మాట్లాడుతూ 81 రోజులకు గాను ఆదాయం మొత్తం రూ.19,29,738 వచ్చిందన్నారు. అన్నదాన మండపంలోని హూండీల ద్వారా రూ.51,369 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని వివిధ బ్యాంకులలో ఉన్న దేవాలయ ఖాతాలకు జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో నరసరావుపేట, గుంటూరు, విజయవాడలకు చెందిన సేవా సమితి సభ్యులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెనాలిరూరల్: తెనాలికి చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి మృతి వైద్య రంగానికి తీరని లోటని పలువురు వైద్యులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ఐఎంఏ తెనాలి శాఖ వైద్యులు సంతాపం వ్యక్తం చేశారు. తెనాలి బోసు రోడ్డులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ వైద్యులు మాట్లాడుతూ డాక్టర్ దక్షిణామూర్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైద్య రంగానికి ఆయన అందించిన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ విశ్వమోహనరావు, డాక్టర్ కల్యాణి ప్రసాద్ తదితరులు ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జి. రవిశంకరరావు, కార్యదర్శి డాక్టర్ జి. కోటేశ్వరప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎ. చక్రవర్తి, కోశాధికారి డాక్టర్ టి. అఖిలేష్, సీనియర్ సభ్యులు డాక్టర్ కె. రమేష్‌బాబు, డాక్టర్ ఎన్. శివరామప్రసాద్, డాక్టర్ జె.వి. సుబ్బారావు, డాక్టర్ ఉమా మహేశ్వరరావు, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ జి. సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దుర్గగుడి ఘాట్‌రోడ్డును ఆలయ ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు బుధవారం పరిశీలించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీగణపతి ప్రాంగణం, డోనర్‌సెల్, ఓం టర్నింగ్ కొండ మలుపులో కొండ చరియలను పరిశీలించారు. అనంతరం ఘాట్‌రోడ్డులో దసరా ఉత్సవాలకు ముందు కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ కొంత మట్టి, కొండ చరియలు విరిగిపడటాన్ని గుర్తించారు. వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే తొలగించాలని ఆదేశించారు.


