ఈవీఎం గోదాము తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోదాము తనిఖీ

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

ఈవీఎం గోదాము తనిఖీ గుంటూరు జిల్లాలో 1,027 మంది బైండోవర్‌ ముగిసిన మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి చిన్నారులపై కుక్కలు దాడి

ఫిరంగిపురం: మండలంలోని రేపూడి వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని గోదాముల్లో భద్రపర్చిన ఈవీఎంలను జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ ఆదివారం తనిఖీ చేశారు. గోడౌన్‌లో భద్రపర్చిన ఈవీఎంలు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, గోడౌన్‌ తాళాలు, రిజిస్టర్లు పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం ఖచ్చితమైన మార్గదర్శకాలు ఇచ్చిందని చెప్పారు. పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ జె.ప్రసాదరావు, వివిధ పార్టీల నాయకులు, రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నగరంపాలెం: జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లల్లో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ కొనసాగించారు. మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రౌడీషీటర్లపై ముందస్తు బైండోవర్‌లు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 1,027 మందిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేసినట్లు పేర్కొన్నారు. గత తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని రౌడీషీటర్లకు పోలీస్‌ అఽధికారులు సూచించారు. ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని చెప్పారు. చెడు స్నేహాలు, అసాంఘిక కార్యకలాపాలు, నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని హితవు పలికారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): మాస్టర్స్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో పోటీలు నిర్వహించారు. మొత్తం 105 మంది పాల్గొన్న ఈ పోటీల్లో త్రోస్‌, జంప్స్‌, రన్నింగ్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షులు షేక్‌ లాల్‌ వజీర్‌ మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభకనబరచిన వారిని డిసెంబర్‌ 12, 13 తేదీల్లో ఒంగోలులో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందన్నారు.

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.పద్మావతి

గుంటూరు మెడికల్‌: జిల్లాలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మక్కెన పద్మావతి ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను తమ దగ్గర ఉన్న లిస్టు ఆధారంగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకుగాని లేదా సామాజిక ఆరోగ్యలకు గాని తరలించాలన్నారు. తుపాను పరిస్థితుల రీత్యా విద్యుత్‌ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యాధికారులు వ్యాక్సిన్‌లను సురక్షితంగా ఉంచడంలో భాగంగా జనరేటర్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తల్లీబిడ్డ వెండర్లు అవసరాన్ని బట్టి గర్భిణులను ఆరోగ్య కేంద్రాలకు తరలించడంలో భాగంగా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ను 72075 95104కు సంప్రదించాలన్నారు.

నెహ్రూనగర్‌: రామిరెడ్డితోట 5వ లైను (8వ డివిజన్‌)లో కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు గాయాలపాలైయ్యారు. పొట్ట, చేయి మీద దాడి చేయడంతో చిన్నారులు భయాందోళనలో అరవడంతో వెంటనే స్పందించిన స్థానికులు కుక్కలను తరిమేశారు. గాయాలపాలైన చిన్నారులను జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించడంతో ప్రాణపాయం తప్పింది. నగరంలో విచ్చలవిడిగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వీటికి నగరపాలక సంస్థ అడ్డుకట్ట వేయడంలో విఫలం చెందారని దీని వలన అభం శుభం చిన్నారులు కుక్కల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement