● 28వ వార్డు కౌన్సిలర్ స్థానం టీడీపీకి కేటాయించినా.. ● జనసేన నుంచి కోటిరత్నారావు నామినేషన్ సైతం ఖరారు ● పార్టీ పెద్దల అండతోనే బరిలో నిలిచినట్టు ప్రచారం ● 28వ వార్డు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ
సత్తెనపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చి నామినేషన్లు దాఖలు చేయడం, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే అధికారిక జాబితా విడుదలైనా క్షేత్ర స్థాయిలో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 28వ వార్డు కౌన్సిలర్ స్థానం కేటాయింపు వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చు పెడుతుంది. పొత్తులో భాగంగా పట్టణంలోని 36 వార్డు కౌన్సిలర్ స్థానాలకు గాను 31 స్థానాలు టీడీపీ, 3 స్థానాలు జనసేన, రెండు స్థానాలు బీజేపీకీ కేటాయించారు. 28వ వార్డు కౌన్సిలర్ స్థానం జనరల్‌కు కేటాయించటంతో వల్లెం శ్రీనివాసరావు అలియాస్ రాడ్లు శ్రీను టీడీపీ నుంచి బరిలోకి దింపగా బీ–ఫారం కూడా ఇచ్చారు. ఆయన నామినేషన్ దాఖలు చేశాడు. అదే వార్డు నుంచి జనసేన తరఫున అమ్మిశెట్టి కోటిరత్నారావు నామినేషన్ దాఖలు చేశాడు. జనసేన పార్టీ నుంచి బీ–ఫారం కూడా కేటాయించడంతో ఆదివారం విడుదలైన మున్సిపల్ అభ్యర్థుల అధికారిక తుది జాబితాలో ఇరువురు పోటీలో నిలవడం గమనార్హం. ఈ వార్డు నుంచి టీడీపీ, జనసేన అభ్యర్థులు పోటీలో ఉండడంతో కూటమి అభ్యర్ధి ఎవరన్నదాని పై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల్లోనూ గాజుగ్లాస్ గుర్తుపై వేసే ఓటు జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న అమ్మిశెట్టి కోటి రత్నారావుకే దక్కనుంది. జనసేన పార్టీ పెద్దల అండతోనే మున్సిపల్ ఎన్నికల బరిలో కోటిరత్నారావు నిలిచినట్టు ప్రచారంలో ఉంది. వీరిద్దరు కాగా వైఎస్సార్ సీపీ నుంచి సంకుల తిరుపతిరావు అలియాస్ తిరుముల, స్వతంత్ర అభ్యర్థిగా అమ్మిశెట్టి సాయి ప్రసన్న పోటీ బరిలో నిలిచారు. అలాగే 5వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా యక్కల గురు పోటీలో ఉండగా ప్రత్యర్థిగా కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి మాడ నాగరమేష్ కుమార్, మరో ముగ్గురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు.
తలలు పట్టుకుంటున్న టీడీపీ శ్రేణులు
ముప్పాళ్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరిగే ముప్పాళ్ల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్ గుర్తు కనిపించని పరిస్థితి నెలకొంది. కూటమి పొత్తులో భాగంగా జెడ్పీటీసీ స్థానం జనసేనకు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ, సీపీఎంలతోపాటుగా జనసేన తరుపున నామినేషన్‌లు దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో ఆ పార్టీ గుర్తు కనిపించే అవకాశం లేకుండా పోయింది. త్వరలో వచ్చే బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ గుర్తు అయిన ఫ్యాన్ తో పాటుగా, జనసేన గుర్తు, సీపీఎం గుర్తులు మాత్రమే కనిపించనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా పార్టీ గుర్తు కనిపించకపోవటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ గుర్తు కనిపించకుండా చేసిన జనసేన అభ్యర్థికి సహకరించేది లేదంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
వల్లెం శ్రీనివాసరావు
అమ్మిశెట్టి
కోటిరత్నారావు


