నవంబర్ 28, 29 తేదీల్లో బాలోత్సవ్
నరసరావుపేట ఈస్ట్: విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు పల్నాడుజిల్లా బాలోత్సవాలు దోహదపడతాయని బాలోత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ షేక్ మస్తాన్‌షరీఫ్, కట్టా కోటేశ్వరరావు తెలిపారు. శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల వేదికగా నవంబర్ 28, 29 తేదీలలో నిర్వహించనున్న 4వ పల్నాడు బాలోత్సవ్, 2వ రాష్ట్రస్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణపై కళాశాల ఆడిటోరియంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. బాలోత్సవాన్ని విజయవంతం చేసేందుకు నిర్వహణ కమిటీ ఆధ్యక్షకార్యదర్శులుగా నియమితులైన డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు, శ్రావ్య పృధ్వీరాజ్‌ను ఘనంగా సత్కరించారు. ఉత్సవాల నిర్వహణకు డాక్టర్ సురేష్‌బాబు రూ.4.5లక్షలు విరాళంగా అందచేశారు. ఆయన మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, కళాభిమానులు, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
అమరావతి: ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ తన కంటే వెనుక రుణం తీసుకున్న వారికి కూడా చెల్లిస్తుంటే, పనులు లేక కిస్తీలు కట్టలేక మండల పరిధిలోని అత్తలూరు గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు బంకా శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తలూరుకు చెందిన బంకా శ్రీనివాసరావు 2024వ సంవత్సరంలో వైఎస్సార్ నవోదయం పథకం ద్వారా 50 శాతం సబ్సిడీపై పొక్లెయినర్ మంజూరు చేశారు. సుమారు రూ.66లక్షల విలువైన పొక్లెయినర్‌ను ప్రభుత్వం ద్వారా పొందిన బంకా శ్రీనివాసరావు అప్పటి నుంచి మండలంలో పలు గ్రామాలలో పనులు చేయించి తొలి పదినెలలపాటు కిస్తీ సుమారు రూ.10 లక్షలు చెల్లించారు. ప్రస్తుతం పనులు లేక ఆదాయం పడిపోవటంతో అంతకు ముందు తీసుకున్న గృహ నిర్మాణ రుణం వాయిదాలు చెల్లించలేకపోయాడు. ఈ రెండేళ్లలో రుణం తీసుకున్న వారికి కూటమి ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేసి గత ప్రభుత్వ హయాంలో రుణాలు తీసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి సబ్సిడీ మంజూరు చేయలేదు. పొక్లెయినర్ కిస్తీ, ఇటు హౌసింగ్ రుణం కలిపి నెలకు లక్షల రూపాయలు చెల్లించాల్సి రావటంతో మనస్థాపం చెందిన అతను 23వ తేదీ పురుగుమందు తాగి అత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు, అత్తలూరు పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం గుంటూరులోని ప్రైవేటు అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బంకా శ్రీనివాసరావు(42) శనివారం సాయంత్రం మృతిచెందాడు. పోలీసులు శవపంచనామా చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంకా శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


