పరాకాష్టకు బెదిరింపులు | - | Sakshi
Sakshi News home page

పరాకాష్టకు బెదిరింపులు

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

పరాకాష్టకు బెదిరింపులు

కూటమిలో ఓటమి భయం

● వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ

అభ్యర్థులే లక్ష్యం

● నామినేషన్ల ఉపసంహరణకు

తీవ్ర ఒత్తిడి

● ఏకగ్రీవాల కోసం పోలీసులు,

కూటమి నేతల కుతంత్రం

● అజ్ఞాతంలోకి వైఎస్సార్‌ సీపీ

జెడ్పీటీసీ అభ్యర్థులు

దాచేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపుల పర్వం పరాకాష్టకు చేరింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బెదిరించి, ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు కూటమి నేతలు బరితెగిస్తున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని దాచేపల్లి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. వీరి నామినేషన్లన్నీ ఖరారు కావడంతో సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు బరిలో నిలిస్తే ఓటమి తప్పదనే భయాందోళనతో కూటమి నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

బరిలో నిలిచిన అభ్యర్థులు

గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ తరఫున పలువురు జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దాచేపల్లి నుంచి తండా అబ్దుల్‌సత్తార్‌, ఉల్లేరు హనుమంతరావు, పిడుగురాళ్ల నుంచి మూడేల భారతి, వీరభద్రుని అనూరాధ, మాచవరం నుంచి దొండేటి వెంకాయమ్మ, గురజాల నుంచి వేముల శేషమ్మ జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వీరి నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆమోదించారు. వీరిలో నలుగురికి పార్టీ తరఫున బీ–ఫారాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. నాలుగు మండలాల్లో బలమైన అభ్యర్థులు జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలవడంతో కూటమికి గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రాణభయంతో అజ్ఞాతంలోకి...

వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులకు తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. కొంతమంది టీడీపీ నేతలు నేరుగా అభ్యర్థులకు ఫోన్‌ చేసి, ‘‘మాట్లాడుకుందాం రా’’ అంటూ బెదిరిస్తున్నారు. ‘‘ఇప్పుడున్నది మా ప్రభుత్వం అని గుర్తుపెట్టుకో’’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆగకుండా అభ్యర్థుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ద్వారా కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒకవైపు కూటమి నేతలు, మరోవైపు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులపై తీవ్రమైన బెదిరింపుల వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన తర్వాత గ్రామాల్లోనే ఉన్నప్పటికీ ఒత్తిడి పెరగడంతో అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థులకు కూడా బెదిరింపులు వస్తుండటంతో వారు సైతం సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రతిపాదించిన వ్యక్తుల కదలికలపై కూడా కూటమి నేతలు దృష్టి సారించి, వారి ద్వారా అభ్యర్థుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు రణరంగాన్ని తలపించేలా ఉండటంతో ప్రాణ భయంతో అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లారు.

వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన

తండా అబ్దుల్‌సత్తార్‌, ఉల్లేరు హనుమంతరావు, దొండేటి వెంకాయమ్మ, మూడేల భారతి, వీరభద్రుని అనూరాధ, వేముల శేషమ్మ

వైఎస్సార్‌ సీపీ తరఫున దాచేపల్లి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల జెడ్పీటీసీ అభ్యర్థులుగా బలమైన నాయకులు బరిలో నిలవడంతో కూటమి అభ్యర్థులకు భయం పట్టుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు నగర పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారనే అంశంపై ప్రజల్లో, వ్యాపార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అక్కడికక్కడే అడ్డుకుని, తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న విషయాన్ని ప్రజలంతా రోజూ చూస్తూనే ఉన్నారు. ఇటువంటి వ్యవహారాలతో కూటమిపై ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగింది. ఈ విషయాన్ని గమనించిన కూటమి అభ్యర్థులు పోటీ లేకుండా ఏకగ్రీవాలు చేసుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే ఆందోళన వారిని వెంటాడుతోంది. ప్రజల్లో ఉవ్వెత్తున ఉన్న అసంతృప్తి ఓట్ల రూపంలో కూటమికి చేటు చేస్తుందని వారు మదనపడుతున్నారు. దీంతో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లను బలవంతంగానైనా ఉపసంహరింపజేసేలా పావులు కదిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement