నగరంపాలెం: దీపావళి పండుగ దృష్ట్యా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా బాణసంచా దుకాణాల్లో పోలీస్ అధికారులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తాడేపల్లి, మంగళ గిరి, నగరంపాలెం పరిధిలోని టపాసుల హోల్‌సేల్, రిటైల్ విక్రయ కేంద్రాలు, టపాసులు నిల్వ ఉంచే ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అగ్నిమాపక భద్రతా నిబంధనలు, అనుమతులు, ఇతర భద్రతా ప్రమాణాలను దుకాణాల యజమానులు పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలించారు. టపాసుల నిల్వ, విక్రయాల వేళల్లో భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలని దుకాణదారులు, నిర్వాహకులకు సూచించారు. తనిఖీల్లో గుంటూరు పశ్చిమ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, సీఐలు రాజేష్(నగరంపాలెం పీఎస్), సీహెచ్ వెంకట్ (మంగళగిరి గ్రామీణ), వీరేంద్ర బాబు (తాడేపల్లి పీఎస్), పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహానాడు ప్రాంతం సమీపంలో ర్యాపిడో డ్రైవర్‌పై జరిగిన దాడి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అందిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన రామకృష్ణ ర్యాపిడో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున విజయవాడ బస్టాండ్ నుంచి తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి వచ్చి తిరిగి వెళ్తుండగా సీతానగరం సబ్‌స్టేషన్ వద్ద నలుగురు యువకులు అతడిని అడ్డగించినట్లు సమాచారం. అతడిపై దాడి చేసి, అతని వద్ద ఉన్న రూ.35 వేల నగదు లాక్కున్నట్లు తెలుస్తోంది. బాధితుడి సెల్‌ఫోన్ ద్వారా ఫోన్‌పే చేయడానికి దుండగులు ప్రయత్నించినప్పటికీ సాంకేతిక సమస్య కారణంగా నగదు బదిలీ కాలేదని సమాచారం. అనంతరం ఫోన్‌ను తిరిగి ఇచ్చి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. బాధితుడు వెంటనే 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి సీతానగరానికి చెందిన పాత నేరచరిత్ర ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
విమానాశ్రయం(గన్నవరం): ఎన్టీఆర్ జిల్లా పర్యటనకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేస్తున్న సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఎస్పీజీ దళాలు, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి విజయవాడ వరకు ఆదివారం ఉపరాష్ట్రపతి కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. న్యూఢిల్లీ నుంచి ఉదయం 10.05 గంటలకు ఉప రాష్ట్రపతి ఇక్కడికి చేరుకుని రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళ్లనున్నారు. పర్యటన అనంతరం తిరిగిన మధ్యాహ్నం 12.50 గంటలకు ఇక్కడికి చేరుకుని న్యూఢిల్లీ వెళ్తారని అధికారులు తెలిపారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి భద్రత, ప్రొటోకాల్ ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ పుస్తక మహోత్సవం నూతన అధ్యక్షుడిగా తలముడిపి మనోహర్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పుస్తక మహోత్సవాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన విజయవాడ పుస్తక మహోత్సవం నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో మనోహర్ నాయుడుతో పాటు ఉపాధ్యక్షుడిగా జక్కంపూడి ప్రసాద్, కార్యదర్శిగా కె. లక్ష్మయ్య, సహాయ కార్యదర్శిగా ఏబీఎస్ సాయిరామ్, కోశాధికారిగా కొండపల్లి రవి, పలువురు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.


