కూటమిలో బయటపడ్డ అంతర్గత పోరు విత్డ్రా చేసుకునేందుకు రెబల్ అభ్యర్ధులు నిరాకరణ సాగుతున్న ప్రలోభాల పర్వం
ముప్పాళ్ల: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియతో కూటమిలో అంతర్గత పోరు మరోమారు బహిర్గతమయ్యాయి. కూటమిలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీల మద్య విభేదాలు రచ్చకెక్కాయి. సరైన ప్రాధాన్యత లేదంటూ కూటమిలోని జనసేన పార్టీ, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టు ఉన్న చోట పోటీలో ఉంటామని జనసేన పార్టీ ముఖ్య నాయకులు చెప్పటంతో ఆ దిశగా గ్రామస్థాయిలో పట్టు నిలుపుకునేందుకు గాను దమ్మాలపాడు, చాగంటివారిపాలెం, మాదల గ్రామాల్లో జనసేన అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఎవరిని అడిగి నామినేషన్లు దాఖలు చేశారంటూ టీడీపీ నాయకులు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. నామినేషన్లు విత్డ్రా చేసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేస్తున్నారు. టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడకుండా పోటీలో ఉంటామని జనసేన నాయకులు ప్రచార పర్వానికి సిద్దం అవుతున్నారు.
ఎంపీపీ పదవి ఆశ చూపి...
ఎంపీపీ పదవి జనసేనకు ఇస్తామని దమ్మాలపాడు గ్రామానికి చెందిన జనసేన నాయకులకు టీడీపీ ముఖ్య నాయకులు ఆశ చూపారు. అదే ఆశతో మొదటిరోజు నామినేషన్ కేంద్రం వద్ద జనసేన నాయకులు నామినేషన్లను చించివేస్తూ హడావుడి చేశారు. మరుసటి రోజు అదే దమ్మాలపాడు–2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ నాయకులను రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉంచేందుకు నామినేషన్ వేయటంతో కూటమిలోని విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా ఒక స్థానానికి నలుగురు జనసేన అభ్యర్ధులు, ఒక టీడీపీ అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. ఆ స్థానంలో ఎవరి వారే జనసేన అభ్యర్ధులుగా ప్రకటించుకోవటం గమనార్హం. పార్టీ బీ–ఫారం ఎవరికి కేటాయిస్తారనేది కూటమిలో చర్చనీయాంశంగా మారింది. చాగంటివారిపాలెం, మాదల–1 ఎంపీటీసీ స్థానం కూడా జనసేనకు కేటాయిస్తున్నట్లు ముందుగా చర్చించుకోవటంతో జనసేన తరుపున నామినేషన్ దాఖలు చేశారు. ఓటర్లు లేని చోట జనసేన ఎలా పోటీచేస్తుందంటూ టీడీపీ అభ్యర్థిచే మరో నామినేషన్ దాఖలు చేయించారు. బీ–ఫారం తెచ్చుకునేందుకు కూటమిలోని రెండు పార్టీల నాయకులు ఎవరికి వారే బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఆయా స్థానాల్లో రెబల్ అభ్యర్ధులుగా నామినేషన్ వేసిన వారంతా విత్డ్రా చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. వారందరినీ పదవుల ఆశచూపి ప్రలోభాలకు గురి చేసేందుకు నియోజకవర్గ నాయకులు దృష్టి పెట్టి చర్చలు సాగిస్తున్నారు. దీంతో పోటీ అనివార్యమయ్యే అవకాశాలు మెండుగా నెలకొన్నాయి.
బీజేపీ కనుమరుగు...
మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లోను ఒక్కచోట కూడా కూటమిలోని భారతీయజనతాపార్టీ కి కేటాయించిన దాఖలాలు లేక పోవటంతో మండలంలో బీజేపీ పాత్ర కనుమరుగైనట్లేయింది. సీపీఎం ఏకంగా మూడు స్థానాల్లో పోటీలో ఉండేందుకు ఐదు నామినేషన్లు దాఖలు చేయగా, జాతీయస్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి కనీసం ఒక్క చోట పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవటం గమనార్హం. తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకుల కుట్రలతో బీజేపీ సానుభూతిపరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమ ప్రభావం ఎంత ఉందో చూపేందుకు సిద్దం అవుతున్నారు. ఏదేమైనా కూటమిలోని అంతర్గత పోరు స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియతో మరో మారు బహిర్గతమయ్యాయి.


