నామినేషన్లు వేయకుండా వైఎస్సార్ సీపీ నాయకులు, అభ్యర్థుల అరెస్టు పిన్నెల్లిపై అక్రమ కేసు నమోదు.. ఆయన నివాసం ఇనుప కంచెలతో దిగ్బంధం నామినేషన్లు వేయడానికి వచ్చిన మహిళలపై టీడీపీ గూండాల దాడి పెదకూరపాడులో 50 మందికి పైగా వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు యడ్లపాడులో ఉద్రిక్తత.. హైవేపై వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ధర్నా గురజాలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల అక్రమ అరెస్టులు
చిలకలూరిపేటలో లాఠీచార్జీ
టీడీపీ గూండాలను నామినేషన్ కేంద్రాల్లో ఉంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై దాడులు
మాచర్లలో ఇనుపకంచెల దిగ్బంధం
గురజాలలో నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డిని లాక్కెళుతున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: దేశ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా.. ఎస్‌ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినా.. కొందరు ఖాకీల తీరు మాత్రం మారలేదు. పోలీసు శాఖకే మచ్చ తెచ్చేలా అధికార పార్టీ నేతలకు ఊడిగం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు వేయకుండా చూసే బాధ్యతను కొందరు తమ భుజస్కంధాలపై వేసుకుని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లకు వెళ్లి బలవంతంగా నిర్బంధించి, పోలీసు స్టేషన్లలో కూర్చోబెడుతున్నారు. కొందరు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులను సైతం అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటే వీరు ఏ స్థాయిలో దిగజారారో అర్థమవుతోంది. టీడీపీ గూండాలు పోలీసులను అడ్డుపెట్టుకుని నామినేషన్ కేంద్రాల వద్ద కర్రలు, రాడ్లతో హల్‌చల్ చేస్తూ నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిపై దాడులకు తెగబడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కళ్ల ముందే మహిళలపై దాడులు జరుగుతున్నా కొందరు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఈ అరాచకం తారస్థాయికి చేరింది. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ఒక్క నామినేషన్ కూడా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు వేయకుండా అటు పోలీసులు, ఇటు టీడీపీ గూండాలు బరితెగించారు.
నరసరావుపేటలో దాడులు
నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు బుధవారం ఇచ్చిన హామీ మేరకు రొంపిచర్ల మండల అభ్యర్థులను నామినేషన్లు వేయించాలంటూ గోపిరెడ్డి పోలీసులను ఎన్నిసార్లు అడిగినా రోజంతా మభ్యపెట్టారు. నామినేషన్లు మాత్రం వేయించలేదు. చివరి రోజు అయిన శుక్రవారం పోలీసులు సహకరించకపోయినా తామే వెళ్లి నామినేషన్లు వేస్తామని గోపిరెడ్డి హెచ్చరించారు. నరసరావుపేట జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు మోహరించి, నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిపై దాడులకు తెగబడ్డారు. నరసరావుపేట మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్ వేసేందుకు వెళ్లిన సీపీఎం అభ్యర్థులను టీడీపీ వారు అడ్డుకుని కొట్టడంతో వారు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో పోలీసులు వారిని తీసుకెళ్లి నామినేషన్ వేయించారు.
పెదకూరపాడులో మహిళపైనా దాడి
పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకరరావును హౌస్ అరెస్టు చేసిన పోలీసులు, బుధవారం అర్ధరాత్రి వరకు ఐదు మండలాల్లో ముఖ్య నాయకులు, అభ్యర్థులను సైతం అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఎక్కడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులే అడ్డుకున్నారు. క్రోసూరు మండలం దొడ్లేరులో ఎంపీటీసీ అభ్యర్థిగా షేక్ బషీరా నామినేషన్ వేసేందుకు వెళ్లగా, ముస్లిం మహిళ అని కూడా చూడకుండా టీడీపీ వారు దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారు. క్రోసూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేసేందుకు వెళ్లాల్సిన షేక్ గఫూర్‌ను తెల్లవారుజామున 2 గంటల సమయంలో పోలీసులు అక్రమంగా నిర్బంధించి స్టేషన్‌కు తరలించారు. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జానిబాషా నేతృత్వంలో వందల మంది గూండాలు నామినేషన్ కేంద్రాల వద్ద కర్రలు, రాడ్లతో మోహరించి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా కాపలా కాశారు. అచ్చంపేట మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను సీఐ హరిబాబు అడ్డుకుని నామినేషన్లు వేయనీయలేదు.
గురజాలలో గూండాయిజం
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని నరసరావుపేటలో హౌస్ అరెస్టు చేసిన పోలీసులు, నాలుగు మండలాల్లో ఎక్కడా ఒక్క ఎంపీటీసీ స్థానానికి కూడా నామినేషన్ పడనీయకుండా అడ్డుకున్నారు. గురజాల పట్టణంలో నామినేషన్ వేసేందుకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్డుపై నిరసనకు దిగారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు, పోలు వీరారెడ్డి, ఎంపీపీ అభ్యర్థి కొమ్మినేని బుజ్జిలను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం అందరినీ హౌస్ అరెస్టు చేశారు.
సత్తెనపల్లిలో నామినేషన్ల చించివేత
సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడి చేసి, నామినేషన్ పత్రాలు చించివేశారు. గణపవరం ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థిని లోపల ఉన్న టీడీపీ వారు వెనక్కి పంపించివేశారు. నకరికల్లు టీడీపీ నేత బాజీ చౌదరి నామినేషన్ కేంద్రాల వద్ద అనుచరులతో హల్‌చల్ చేస్తూ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని పత్రాలు చించివేశారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా షేక్ తంగెళ్ల మౌలాలి నామినేషన్ వేసేందుకు వెళ్లగా, అక్కడ ఉన్న టీడీపీ గూండాలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని ఎదురించి నామినేషన్ దాఖలు చేశారు.
రేపల్లెలో రౌడీయిజం
రేపల్లె నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అక్కడి టీడీపీ నేతలు నామినేషన్లను అడ్డుకున్నారు. లంకవానిదిబ్బకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌కు సిద్ధమవుతుండగా, టీడీపీ నాయకులు నామినేషన్ పత్రాలు, సెల్‌ఫోన్, రూ.11 వేల నగదును లాక్కొని పారిపోయారు. నిజాంపట్నంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి చిత్తల సాయిబాబు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సోదరుడు హరినాథ్‌బాబు అనుచరులు సాయిబాబు ఇంటిని ధ్వంసం చేశారు.
వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును నరసరావుపేటలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వినుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎక్కడా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ గూండాలు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వినుకొండ మండల కన్వీనర్ బండి చెన్నయ్య నరసరావుపేటలో జెడ్పీటీసీ అభ్యర్థిగాగా నామినేషన్ వేసేందుకు వెళ్లగా, అక్కడ టీడీపీ వారు ఆయనపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారు. ఈపూరు మండలం ముప్పాళ్ల క్రాస్ వద్ద 200 మంది టీడీపీ గూండాలు మోహరించారు. ఇనిమెళ్లకు చెందిన రామినీడి అనిల్ అనే వైఎస్సార్ సీపీ నేత నామినేషన్ వేసేందుకు వెళ్లగా, అతనిపై దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టి, నామినేషన్ పత్రాలు చించివేశారు.
చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో ఎక్కడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద వందల మంది టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో రోడ్లపైనే పోలీసుల ఎదుట తిరుగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. యడ్లపాడులో నామినేషన్ వేసేందుకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకుని లాఠీచార్జి చేయడంతో, ఆగ్రహించిన అభ్యర్థులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఉప్పరపాలెంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన పల్లపు మంగయ్య భార్యపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారు. పోతవరం గ్రామానికి చెందిన రావెళ్ల పద్మ నామినేషన్ వేసేందుకు వెళ్లగా, టీడీపీ గూండాలు మహిళ అని కూడా చూడకుండా ఆమైపె దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారు.
మాచర్లలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. బుధవారం జరిగిన ఘటనలపై అక్రమంగా కేసులు నమోదు చేసి, ఆయన ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా ఇనుప కంచెలతో నాలుగు వైపులా దిగ్బంధం చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఒక్క నామినేషన్ కూడా వేయడానికి వీల్లేదంటూ ఆయా కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలతో మోహరించారు. కారంపూడిలో టీ స్టాల్ నడుపుకొంటున్న చిన్నగార్లపాడుకు చెందిన గొట్టిముక్కల వెంకటరెడ్డిపై కొందరు టీడీపీ వ్యక్తులు విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. టీ స్టాల్‌ను సైతం ధ్వంసం చేశారు. మాచర్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్ వేసేందుకు వచ్చిన చింతలతండాకు చెందిన రమావత్ శాంతి, గబ్బర్‌సింగ్ దంపతులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. తర్వాత నామినేషన్ పత్రాలు చించివేశారు.


