హామీ ఇచ్చి మోసం చేసిన పోలీసులు ఎవరు అడ్డుకున్నా నేడు నామినేషన్లు దాఖలు ఖాయం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకపోతే భవిష్యత్‌లో టీడీపీ తీవ్రంగా నష్టపోతుందని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో రొంపిచర్ల మండలానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. రొంపిచర్లలో ఎంపీటీసీ సభ్యులతో కలిసి బుధవారం నామినేషన్ వేసేందుకు వెళ్లగా డీఎస్పీ ఎం.హనుమంతరావు ద్వారా జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ‘అందరిచేత గురువారం పోలీసుల రక్షణతో తప్పకుండా నామినేషన్ వేయిస్తామని’ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. తామంతా ధర్నా విరమించి వెనక్కి వచ్చామన్నారు. గురువారం తమ కార్యాలయానికి గానీ, పార్టీ కార్యాలయానికి గానీ వారందరినీ పిలిపిస్తే తీసుకెళ్లి నామినేషన్లు వేయిస్తామని ఉదయాన్నే డీఎస్పీ కబురు చేశారన్నారు. అందరం సిద్ధమై మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఎదురుచూశామని తెలిపారు. తీరా ఆరుగురు, లేదా ఏడుగురి చేత మాత్రమే నామినేషన్లు వేయిస్తామని చెప్పారన్నారు. అవకాశం ఇస్తే 18 మంది వేస్తారని, లేకపోతే ఎవ్వరూ వేయబోరని అభ్యర్థుల తరఫున స్పష్టంగా చెప్పామని పేర్కొన్నారు. శుక్రవారం అవకాశం కల్పిస్తామని చెబుతున్నా వారి మాటలు నమ్మే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయాన్ని కోర్టుకు తెలియచేసే పనిలో ఉన్నామన్నారు. శుక్రవారం అభ్యర్థులు అందరూ నామినేషన్లు కచ్చితంగా దాఖలు చేస్తారని డాక్టర్ గోపిరెడ్డి స్పష్టం చేశారు. రౌడీలు, గూండాలతో తమపై దాడి చేయిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పరిస్థితి రేపు ఏమిటో ఆలోచించుకోవాలన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకోవచ్చని, ఎవరూ అడ్డగించట్లేదంటూ ప్రకటించటాన్ని విలేకరులు డాక్టర్ గోపిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ ముందుండి నామినేషన్లు వేయించాలని డాక్టర్ గోపిరెడ్డి కోరారు. ఎంపీ చెప్పేది ఒకటి, చేసేది మరొకటని పేర్కొన్నారు.


