ఎన్నికల కమిషన్ పాత్రపై విమర్శలు..
నరసరావుపేట టౌన్: ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ.. నామినేషన్‌లంటే పోటీచేసే హక్కుకు తొలిమెట్టు.. కాని పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆ హక్కుకు సంకెళ్లు పడ్డాయి. అధికార పార్టీకి సలాం కొడుతూ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాల్సిన అధికారులు కళ్లులేని కబోదుల్లా వ్యవహరిస్తుండగా భద్రత కల్పించాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు నామినేషన్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల నామినేషన్‌లను వైఎస్సార్‌సీపీ నాయకులు వేయనీయకుండా టీడీపీ గూండాలు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. శుక్రవారం చివరి రోజు కూడా నామినేషన్ వేయనీయకుండా అడ్డుకొని ఏకగ్రీవం చేసుకోవాలన్న కుట్రతో అధికార టీడీపీ పార్టీ కుయిక్తులు పన్నుతొంది. దీంతో చివరిరోజు మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో జరగాల్సిన నామినేషన్‌ను టీడీపీ గూండాలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని నామినేషన్‌లు వేసేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. నామినేషన్ పత్రులను బలవంతంగా లాక్కొని బహిరంగంగా చించేస్తున్నారు. జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రమైన ఆర్డీవో కార్యాలయం, ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసే ఎంపీడీవో కార్యాలయాలకు కూతవేటు దూరంలో టీడీపీకి చెందిన రౌడీషీటర్‌లు, గంజాయి బ్యాచ్ బహిరంగంగా మారణాయిధాలతో సంచరిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. నామినేషన్‌లకు వచ్చే వారిపై బహిరంగ దాడులకు తెగబడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా దాసోహం అవ్వటం విమర్శలకు తావిస్తుంది.
28 స్థానాలకు రెండింటికే నామినేషన్..
పోలీసుల ఆధ్వర్యంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ అడ్డుపడుతుండటంతో పల్నాడు జిల్లాలో 28 జెడ్పీటీసీ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రెండు స్థానాలకు మాత్రమే నామినేషన్ దాఖలు చేయగలిగారు. మిగిలిన స్థానాల్లో నామినేషన్ వేయలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసుల ఆధీనంలో ఉండాల్సిన నామినేషన్ కేంద్రాలను పచ్చమూకలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
చివరిరోజు ఉద్రిక్తత తప్పదా..
నామినేషన్‌కు చివరి రోజు కావటంతో శుక్రవారం మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు, అల్లరి మూకలు నరసరావుపేట లోని లాడ్జీలలో బసచేశారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ మాజీ కౌన్సిలర్‌కు చెందిన నవయుగ లాడ్జీలో టీడీపీ అల్లరిమూకలు బసచేశారు. మారణాయుధాలు, రాళ్లు పెద్దసంఖ్యలో అక్కడకు తరలించినట్లు సమాచారం. దాడులు చేసేందుకు అక్కడ కుట్ర చేస్తున్నారని తెలుస్తొంది. జెడ్పీటీసీ నామినేషన్ వేసే కేంద్రం ఆర్డీవో కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న లాడ్జిలో టీడీపీ గూండాలు బసచేసి హల్‌చల్ చేస్తున్న విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అర్థరాత్రి అరెస్ట్‌లతో బెదిరింపులు..
మరో వైపు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు అర్థరాత్రి ఇళ్లకు వెళ్లి అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు. వరవకట్టకు చెందిన మైనార్టీ నాయకుడు షేక్ పెద్ద బుజ్జి, బరంపేటకు చెందిన మాజీ కౌన్సిలర్ మీరావలి, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కొత్తూరి కిషోర్‌లను అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు కూనిశెట్టి హనుమంతరావు, నిడమానూరి సురేంద్ర, శ్రీకృష్ణలకు నోటీసులు ఇచ్చి బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే నోటీఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ వరకు సజావుగా జరిగేలా చూడాలి. ఇందుకోసం ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల, పోలీస్ అధికారులను సమన్వయం చేయాలి. నామినేషన్ కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి అభ్యర్థులు సురక్షితంగా నామినేషన్ వేసే వాతావరణాన్ని కల్పించాలి. నామినేషన్ కేందాల వద్ద సీసీ, డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు వీడియో ఆధారాలు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అభ్యర్థుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. ప్రస్తుత జరుగుతున్న పరిణామాలు ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతొంది. ఎన్నికల నిర్వహణలో తీవ్రమైన వైఫల్యంగా పల్నాడు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు చరిత్రలో మిగిలిపోనున్నాయి. ఇకనైనా ఎన్నికల సంఘం స్పందించి ప్రతి అభ్యర్థికి సమాన అవాకాశాలు కల్పిస్తుందో, లేక అధికార పార్టీకి అండగా నిలుస్తోందో వేచి చూడాల్సి ఉంది.


