42 మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై కేసు | - | Sakshi
Sakshi News home page

42 మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై కేసు

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

యడ్లపాడు: వైఎస్సార్‌ సీపీకి చెందిన 42 మందిపై కేసులు నమోదయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా యడ్లపాడులో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం హైవేపై ధర్నాకు దిగిన వారిపై ఈ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలిస్తూ మరికొందరిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ధర్నాలో పాల్గొన్న మహిళల వివరాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు గుర్తించిన 42 మందిలో ఆరుగురిని గతంలోనే ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున బైండోవర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. బైండోవర్‌ ఉత్తర్వుల్లోని షరతులు, చట్టపరమైన నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై ధర్నాలు, రాస్తారోకోలతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతోపాటు ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా, నిరసనలను చట్టబద్ధమైన మార్గాల్లో తెలియజేయాలని సూచించారు. ప్రజా రవాణాకు, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వైఎస్సార్‌ సీపీకి మద్దతు తెలిపినందుకు దాడి

అచ్చంపేట: వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థికి మద్దతు తెలిపాడన్న కారణంతో టీడీపీ కార్యకర్తపై అదే పార్టీ వర్గీయులు దాడికి పాల్పడిన ఘటన మండలంలోని చింతపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చింతపల్లి ఎంపీటీసీ స్థానం జనరల్‌ కేటగిరి కేటాయించడంతో అభ్యర్థిగా షేక్‌ నాగుల్‌వలిని ఎంపిక చేశారు. అతను గురువారం అచ్చంపేటలో నామినేషన్‌ వేసేందుకు వెళ్లాడు. టీడీపీలో ఉన్న నాగుల్‌వలి తమ్ముడు మస్తాన్‌వలి తన అన్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా ఎంపిక కావడంతో మద్దతు తెలిపినందుకు గ్రామంలోని టీడీపీ మూకలు మస్తాన్‌వలిపై దాడిచేయగా తలకు తీవ్ర గాయాలైనాయి. వెంటనే గాయాలపాలైన మస్తాన్‌వలిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం మస్తాన్‌వలి పరిస్థితి బాగానే ఉంది. అయితే అచ్చంపేట సీఐ తెలిపిన సమాచారం మేరకు పార్టీల గొడవకాదని, మధ్యం ఎక్కువగా సేవించి గొడవలకు దిగడంవల్లనే దెబ్బలు తగిలాయని, మెరుగైన చికిత్స నిమిత్తం సత్తెనపల్లి పంపినట్లు తెలిపారు.

జిల్లా స్థాయి బాలల ఫెడరేషన్‌ ఏర్పాటు

అమరావతి: బాలల హక్కుల పరిరక్షణకు, బాలల సమస్యల పరిష్కారానికి బాలల ఫెడరేషన్‌ కృషి చేయాలని చైల్డ్‌ రైట్స్‌ పౌండేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఫ్రాన్సిస్‌ తంబి అన్నారు. గురువారం స్థానిక గుడ్‌ షెఫర్డ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా స్థాయి బాలల ఫెడరేషన్‌ ఏర్పాటు కార్యక్రమానికి ఆయన రిసోర్స్‌పర్సన్‌గా వ్యవహరించారు. సిస్టర్‌ యాంటో మాట్లాడుతూ జిల్లా స్థాయి బాలల ఫెడరేషన్‌ ద్వారా వివిధ గ్రామాల్లోని బాలల పార్లమెంటులను సమన్వయం చేసుకుంటూ, బాలల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement