నిలదీస్తారనే నిస్సిగ్గుగా..! | - | Sakshi
Sakshi News home page

నిలదీస్తారనే నిస్సిగ్గుగా..!

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

నిలదీస్తారనే నిస్సిగ్గుగా..! మున్సిపల్‌ నామినేషన్ల పర్వంలో టీడీపీ అరాచకత్వం

ఎక్కడికక్కడ వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై బెదిరింపులు, ప్రశ్నించిన వారిపై అడ్డగోలుగా దాడులు ఏకగ్రీవాలు చేసేందుకు దిగజారుడు రాజకీయాలు రెండున్నరేళ్లలో అన్ని వ్యవస్థలూ సర్వనాశనం హామీలపై అడిగితే ఏం చెప్పాలో తెలియక ఏకగ్రీవాలు పరిషత్‌ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహంతో వెళ్లనున్న కూటమి! ఆందోళన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

పరిషత్‌ ఎన్నికల్లోనూ అదే పంథా?

మున్సిపల్‌ నామినేషన్ల పర్వంలో టీడీపీ అరాచకత్వం

నరసరావుపేట టౌన్‌: ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ప్రజల మద్దతు కోసం పోటీ పడటం.. తమ పాలన గొప్పదని అధికార పార్టీ చెప్పుకోవచ్చు. తమ ప్రత్యర్థుల వైఫల్యాలను ఎత్తిచూపవచ్చు. కానీ ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడగాల్సిన చోట ప్రత్యర్థి అభ్యర్థులకు నామినేషనన్లు వేసే అవకాశం లేకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తే మాత్రం అది సాధారణ రాజకీయ విమర్శగా కొట్టిపారేయలేని అంశం. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తరహా పరిణామాలు పునరావృతమవుతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనంలోకి వెళ్లేందుకు జంకు

గత ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీల వర్షం కురిపించింది. ప్రధానంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి గురించి ఊదరగొట్టింది. తీరా అధికారంలోకి వచ్చాక అవన్నీ పక్కన పెట్టింది. నూతన పింఛన్ల మంజూరుకు సైతం సవాలక్ష అడ్డంకులు పెట్టింది. ఇప్పటికీ ఒక్క పింఛన్‌ కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఇటు నిత్యావసర ధరల పెరుగుదల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోంది. రేషన్‌ దుకాణాల ద్వారా అందాల్సిన కందిపప్పు వంటి సరుకులు కూడా పంపిణీ చేయడం లేదు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువ కావాలంటే అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల పెత్తనం, స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం వంటి అంశాలు ప్రజల్లో అసహనానికి కారణమవుతున్నాయి. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పేకాట కార్యకలాపాలు విస్తరిస్తున్నాయనే ఆరోపణలు కూడా ప్రజల్లో చర్చకు వస్తున్నాయి.

అడ్డగోలుగా బరి తెగింపు

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సా ర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిపై ఒత్తిడి తెచ్చేందుకు అరెస్టులు, గృహ నిర్బంధాలు, బెదిరింపులు ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యర్థి అభ్యర్థులు బరిలో లేకుండా చేయడం ద్వారా ఏకగ్రీవాలకు మార్గం సుగమం చేశారని ప్రజలు మండిపడుతున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులను అధికార పార్టీ తొత్తుగా మార్చారు. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న అభ్యర్థులను అడ్డుకున్నారు. రాజకీయ కారణాలతో నిర్బంధాలకు పాల్పడ్డారు. అధికార పార్టీ నేతలు దాడులకు దిగినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన అధికార పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ ఇదే పంథా పాటిస్తుందని వైఎస్సార్‌ సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు కల్పించి, ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించి ఏకగ్రీవాలు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే ముందే అభ్యర్థులకు భద్రత, నామినేషన్‌ కేంద్రాల వద్ద పారదర్శకత, ఫిర్యాదుల పరిష్కారానికి స్పష్టమైన వ్యవస్థ ఉండాలని కోరుతున్నాయి. ఏ పార్టీ అభ్యర్థి అయినా నిర్భయంగా నామినేషన్‌ వేసేలా చూడాలని ఎన్నికల యంత్రాంగాన్ని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement