గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మకు ఫ్యాప్టో జిల్లా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్‌ను కలిసిన ఫ్యాప్టో ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ సహేతుకమైన కారణాలతో గైర్హాజరైన ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేస్తామని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నంలోపు డీఆర్వోను కలిసి వివరణ ఇవ్వాలని సూచించారు. కలెక్టర్‌ను కలసిన వారిలో గుంటూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కె.నరసింహారావు, జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ గుడిపాటి దాస్, జిల్లా ఫ్యాక్టో కార్యవర్గ సభ్యులు షేక్ బాజీ, మహమ్మద్ ఖలీద్ ఫ్యాప్టో జిల్లా నాయకులు సిహెచ్ ఆదినారాయణ, జోజప్ప, ఎస్ కె గఫార్, పచ్చాల శివరామకృష్ణ, గురుమూర్తి ఉన్నారు.
గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సమీక్ష
మంగళగిరి టౌన్: పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 21న మంగళగిరిలో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. ఆరో ఏపీఎస్పీ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర ఏర్పాట్లపై సోమవారం ఏఎస్ఎల్ (అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్) సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి కార్యక్రమ వేదిక, పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ స్థలాలు, ప్రముఖుల రాకపోకల మార్గాలను పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమానికి వచ్చే అతిథులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకలను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆరో ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ మురళి, ముఖ్యమంత్రి భద్రతా విభాగం ఎస్పీ భద్రయ్య, అదనపు ఎస్పీ ఏ.టి.వి.రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అలహరి శ్రీనివాస్, నార్త్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సీఐ మల్లికార్జునరావు, మంగళగిరి రూరల్ సీఐ బ్రహ్మం, సీఐ సీహెచ్. వెంకట్‌తో పాటు పోలీసు, ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


