పరిషత్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

పరిషత్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

జాయింట్‌ కలెక్టర్‌ సంజనా శ్రీహర్ష జిల్లాలో 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

నరసరావుపేట రూరల్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ సంజనా శ్రీహర్ష తెలిపారు. ఆర్‌డీవో కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు తెలిపారు. నామినేషన్‌లు ఈనెల 21 నుంచి 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారని, 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్‌ల పరిశీలన ఉంటుందని తెలిపారు. తిరస్కరించిన నామినేషన్‌లకు 25వ తేదీన సాయంత్రం 5గంటలలోపు అప్పీల్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీవో కార్యాలయంలోను, జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 27వ తేదీ మధ్యాహ్నం 3గంటల లోపు నామినేషన్‌లను ఉపసంహరించుకోవచ్చని, అదే రోజు తుది జాబితా ప్రకటిస్తారని పేర్కొన్నారు. నవంబర్‌ 3వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారని, ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. అవసరమైన చోట 4వ తేదీ రీపోలింగ్‌ ఉంటుందని, 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని వివరించారు. కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తారని తెలిపారు. ఎంపీటీసీలకు మండలాల్లోని రిటర్నింగ్‌ ఆఫీసర్లు నామినేషన్‌లు స్వీకరిస్తారని, జెడ్పీటీసీలకు నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింట్‌ అధికారి అయిన జాయింట్‌ కలెక్టర్‌ నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఫాం–4 నామినేషన్‌ ఫాంతోపాటు ఎన్నికల షెడ్యూల్‌ను అందజేసినట్టు పేర్కొన్నారు. నామినేషన్‌ను ఆన్‌లైన్‌లో కూడా పూర్తిచేసి రిటర్నింగ్‌ అధికారికి అందజేయవచ్చని తెలిపారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చే అభ్యర్ధుల కోసం హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగనుందని, 12,42,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం 1548 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 706 అత్యంత సమస్యాత్మకం, 488 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం ప్రతి మండల స్థాయిలో స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు, ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించి మెజరిస్టీరియల్‌ అధికారాలు అప్పగించినట్టు తెలిపారు. సరిహద్దుల చెక్‌ పోస్టుల ద్వారా 24 గంటలపాటు తనిఖీలు జరుగుతున్నాయని వివరించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయపార్టీలు, ప్రజలు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ కోరారు.

నియమావళి ఉల్లంఘించే అధికారులపై చర్యలు..

ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ఏ ఒక్క పార్టీకి మద్దతుగా వ్యవహరించకూడదని, అంతా నిష్పక్షపాతంగా పనిచేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సంజనా శ్రీహర్ష హెచ్చరించారు. ఎవరైనా అధికారి తమ పదవులను దుర్వినియోగం చేసినట్లు తేలితే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఆర్‌డీఓ కార్యాలయంలో సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ‘ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల ప్రక్రియ‘పై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్దీవో బాలకృష్ణ, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement