నరసరావుపేట: ఎన్నికలలో అభ్యర్థులు చేయాల్సిన వ్యయ పరిమితులను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిందని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు భరణి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో డివిజన్, నియోజకవర్గం, మండల స్థాయి వ్యయపరిశీలకుల (అకౌంటింగ్ టీమ్) శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు వ్యయ వివరాలు పేర్కొన్నారు.
పురపాలక సంఘం చైర్మన్‌లకు రూ. 20 లక్షలు, వార్డు సభ్యులకు రూ.7.50 లక్షలు, నగర పంచాయతీ చైర్మన్‌లు రూ.10 లక్షలు, వార్డు సభ్యులు రూ.5 లక్షలు వరకు ఖర్చు చేయవచ్చన్నారు. ఎన్నికలు ముగిసిన 45 రోజుల లోపల అభ్యర్థి తన ఖర్చు వివరాలను రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. ఎన్నికల వ్యయం వివరాలు ఇవ్వకపోయినట్లయితే మూడేళ్ల వరకు ఎటువంటి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉండదన్నారు. అలాగే గెలిచిన అభ్యర్థి 45 రోజు లోపల ఎన్నికల వ్యయం వివరాలు సమర్పించకపోతే డిస్‌క్వాలిఫై చేసే అవకాశం ఉంటుందన్నారు. వ్యయ కమిటీలు, స్టాటిక్ సర్వేలియన్స్ బృందాలు, వీడియో వ్యూయింగ్ బృందాలు, ఎంసీసీ బృందాలు రేయింబవళ్లు తనిఖీ నిర్వహించాలని స్పష్టం చేశారు. సంబంధిత నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు భరణి ఆదేశించారు. నోడల్ అధికారి పద్మజ, ట్రైనర్ ప్రశాంతి, వ్యయ పరిమితి టీమ్ సభ్యులు పాల్గొన్నారు.


