ఎన్నికల షెడ్యూల్ ఇలా...
నేడు జిల్లాలో ఎస్‌ఎంసీ ఎన్నికలు, చైర్మన్‌ల ఎన్నిక
పాఠశాలల్లో టీడీపీ నేతల మితిమీరిన జోక్యం తలలు పట్టుకుంటున్న విద్యాశాఖాధికారులు జిల్లాలో 1,556 పాఠశాలలకు ఎన్నికలు
మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయి.
మధ్యాహ్నం 2:00 గంటలకు ఎన్నికై న చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 3: గంటల నుంచి 3:30 గంటల లోపు నూతన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ తొలి సమావేశం నిర్వహించనున్నారు.
కమిటీ పదవీ కాలం రెండేళ్లు.
మొదలైన రాజకీయ జోక్యం
సత్తెనపల్లి/నరసరావుపేటఈస్ట్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల కోలాహలం మొదలైంది. అన్ని ప్రభు త్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. రెండున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పాఠశాల విద్యను గాలి కొదిలేసి నాశనం చేసింది. కేవలం ప్రచార ఆర్భాటాలు, క్రెడిట్ చోరీ తప్ప విద్యను మెరుగుపరిచిన దాఖలాలు లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈక్రమంలో నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. పాఠశాలల్లో ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా బలవంతపు ఒత్తిళ్లతో ఈ ఎన్నికల్లో పైచేయి సాధించాలని టీడీపీ నాయకులు పన్నాగం పన్నుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంగళవారం జిల్లాలోని 1556 పాఠశాలల్లో ఎన్నికలు జరగనున్నాయి.
అధికారులకు కత్తి మీద సాము
ఎస్‌ఎంసీ ఎన్నికల్లో సభ్యులకు చేతులెత్తే పద్ధతి ద్వారా లేదా బహిరంగ మద్దతుతో ఎన్నుకోవాల్సి ఉంటుంది. బహిరంగంగా మద్దతు తెలపాల్సి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులు ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. రహస్య బ్యాలెట్ ద్వారా అయితే బాగుంటుందని తల్లిదండ్రులు అంటున్నారు. మరోవైపు రాజకీయ జోక్యం లేకుండా ఎన్నికలను నిర్వ హించడం మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలకు తల పోటుగా మారాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడిని వారు తట్టుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా వ్యవహరించకపోతే ఇబ్బందులు వస్తాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఎస్‌ఎంసీ ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే మరి.
జిల్లాలోని 1,556 ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనట్లయితే వెంటనే మండల విద్యాశాఖ అధికారి ద్వారా జిల్లా కార్యాలయానికి తెలియచేయాలి. ఎస్‌ఎంసీ కమిటీలో 50 శాతం మహిళలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులకు దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఎస్‌ఎంసీ యాజమాన్య కమిటీ ఎన్నికలు అన్ని పాఠశాలల్లో నియమావళి ప్రకారం పూర్తి చేయాలి.
–పీవీజే రామారావు, జిల్లా విద్యాశాఖ అధికారి, పల్నాడు
ప్రభుత్వ పాఠశాలల పరిధిలో రాజకీయాలకతీతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో పట్టు సాధించడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు విద్యాశాఖ అధికారులను కలిసి తమ పార్టీ సానుభూతిపరులే ఎన్నికయ్యేలా చూడాలని ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ముఖ్య నేతలు అన్ని పాఠశాలల్లో కూడా తమ పార్టీ వారే ఎన్నికయ్యేలా చొరవ తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం.


