బడిలో ఎని్నకల వేడి | - | Sakshi
Sakshi News home page

బడిలో ఎని్నకల వేడి

Sep 26 2026 2:02 AM | Updated on Sep 26 2026 2:02 AM

ప్రక్రియ ఇలా... జిల్లా సమాచారం ఇదీ..

జిల్లా వ్యాప్తంగా తుది ఓటర్ల జాబితా విడుదల

29న ప్రభుత్వ పాఠశాలల్లోఎస్‌ఎంసీ ఎన్నికలు

చేతులెత్తే పద్ధతి ద్వారా అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ

తల్లిదండ్రుల మద్దతు కూడగడుతున్న ఆశావహులు

రాజకీయ జోక్యం తగదంటున్న విద్యావేత్తలు

జిల్లాలోని పాఠశాలల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రభుత్వ బడుల ప్రగతిలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేసేందుకు రెండేళ్లకు ఓసారి స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నికై న ఎస్‌ఎంసీల కాలపరిమితి ముగిసింది. దీంతో ఈ ఎన్నికకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రక్రియ ఇలా...

ప్రాథమిక పాఠశాలలు : 1,205

ప్రాథమికోన్నత పాఠశాలలు : 54

హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌లు : 297

మొత్తం పాఠశాలలు : 1,556

ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు : 52,119

‘ప్రాథమికోన్నత’లోని విద్యార్థులు : 4,219

హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌

విద్యార్థుల సంఖ్య : 82,068

మొత్తం విద్యార్థుల సంఖ్య : 1,38,046

సత్తెనపల్లి: బడుల్లో మేనేజ్‌మెంట్‌ కమిటీల ఎన్నికలు ఈ నెల 29వ తేదీన నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదల చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల రాజకీయ నాయకుల జోక్యంతో తగాదాలు జరిగాయి. విద్యార్థుల తల్లిదండ్రులు చేతులెత్తే పద్ధతి ద్వారా ఎస్‌ఎంసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఓటర్ల తుది జాబితా విడుదల ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపునకు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు ఎంతో కీలకం. ఈ కమిటీల్లో స్థానం పొందేందుకు ఆశావహులైన తల్లిదండ్రులు సైతం రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. ఆ నేతలు సైతం తమకు అనుకూలమైన వ్యక్తులు ఎస్‌ఎంసీ కమిటీల్లో పదవులు సాధించేందుకు, వచ్చే స్థానిక ఎన్నికల్లో పట్టుకు ఇప్పటికే అనేక ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఎన్నికల నిర్వహణకు కసరత్తు

ఉన్నతాధికారుల ఉత్తర్వులు మేరకు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ కమిటీల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ, సర్వ శిక్ష శాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. 2024 ఆగస్టు 8వ తేదీన నిర్వహించిన ఎన్నికలు పలు చోట్ల రసాభాసగా మారాయి. కూటమి నేతల రాజకీయ ఒత్తిడితో కొన్ని పాఠశాలల్లో ఎన్నికలను నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు.

పెరిగిన రాజకీయ ప్రాధాన్యం

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టడంతో ఈ ఎన్నికలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పాఠశాలలో 12 నుంచి 25 మంది సభ్యులతో ఎస్‌ఎంసీ కమిటీని ఎన్నుకోనున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర సభ్యులు ఈ ఎస్‌ఎంసీలో ఉంటారు. రెండేళ్ల పదవీకాలంలో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి కమిటీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు. పాఠశాల ఆవరణలో నాయకుల జోక్యం లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా విద్యాశాఖ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జిల్లాలోని 1,556 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1,38,046 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నెల 29వ తేదీన ఎస్‌ఎంసీ కమిటీ ఎన్నికలను నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 18న పాఠశాలల నోటీసు బోర్డులపై ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఓటరు జాబితాలో అభ్యంతరాలు, మార్పుచేర్పులపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించేందుకు అవకాశం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం తుది ఓటర్ల జాబితాను ఖరారు చేసి నోటీసు బోర్డులో ప్రదర్శించారు. ఈ నెల 29వ తేదీన ఆయా పాఠశాలల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్‌ఎంసీ కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక, మధ్యాహ్నం 2 గంటలకు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటలకు నూతన ఎస్‌ఎంసీ తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఆయా పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement