నరసరావుపేట రూరల్: జిల్లా పరిషత్ నిధులతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్, జెడ్పీ ప్రత్యేక అధికారి కృతికా శుక్లా తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటైన పల్నాడు జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జెడ్పీ ప్రత్యేక అధికారిగా కృతికా శుక్లా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు, ఉమ్మడి జెడ్పీ సీఈవో జ్యోతిబసు, ఎంపీడీవో టీవీ కృష్ణకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
చెట్టు కిందే సిబ్బంది
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ నుంచి పల్నాడు జిల్లా పరిషత్‌కు 50 మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో ఏవోలు ఐదుగురు, సీనియర్ అసిస్టెంట్‌లు తొమ్మిది మంది, జూనియర్ అసిస్టెంట్‌లు 16మంది, టైపిస్ట్‌లు ఐదుగరు, యూడీ స్టేనో ఒకరు, ఎల్‌డీ స్టేనో ఒకరు, రికార్డ్ అసిస్టెంట్‌లు ఇద్దరు, ఆఫీస్ సబార్డినేట్‌లు పదిమంది ఉన్నారు. శుక్రవారం నుంచి జెడ్పీ పాలన నరసరావుపేట నుంచి ప్రారంభం కావడంతో జిల్లాకు కేటాయించిన అధికారులు, సిబ్బంది విధులకు హాజరయ్యారు. ఉదయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన మండల పరిషత్ ఆఫీస్‌కు సిబ్బంది రాక ప్రారంభమైంది. అయితే కార్యాలయ భవనాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యాలయంలో కుర్చీలు కూడా లేకపోవడంతో మహిళా సిబ్బంది మండల పరిషత్ ప్రాంగణంలోనే చెట్టు కిందనే మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లాకు కేటాయించిన 50 మందిలో 44 మంది విధుల్లో చేరారు.


