మధ్యవర్తుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తుల పాత్ర కీలకం

Sep 26 2026 2:02 AM | Updated on Sep 26 2026 2:02 AM

మధ్యవర్తుల పాత్ర కీలకం పాఠశాలల్లో డీఈఓ తనిఖీలు నేటి నుంచి కొండవీడు కోట సందర్శనకు అనుమతి వైద్యశాలలో సిట్‌ విచారణ

గుంటూరు లీగల్‌: మధ్యవర్తిత్వం నిరంతర ప్రక్రియ అని, ఇందులో మధ్యవర్తుల పాత్ర చాలా ముఖ్యమైనదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో జిల్లా వ్యాప్తంగా మధ్యవర్తులకు, పారా లీగల్‌ వలంటీర్స్‌కు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జియాఉద్దీన్‌ మాట్లాడుతూ దేశం కోసం మధ్యవర్తిత్వం 3.0లో భాగంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ పి.వి.రాజీవ్‌ మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై మరింత అవగాహన కల్పించారు. మధ్యవర్తులకు ఉన్న అనుమానాలకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మధ్యవర్తులు, పారా లీగల్‌ వలంటీర్స్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

తెనాలిరూరల్‌: గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ షేక్‌ సలీం బాషా తెనాలి మండలంలోని పెదరావూరు జెడ్పీ హైస్కూలు ను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను, ఎఫ్‌ఏ–వన్‌ మార్కులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేదీ నుంచి జరిగే ఎఫ్‌ఏ–టూ పరీక్షలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలని సూచించారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అంగలకుదురు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తనిఖీ చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాత్రలు మింగించారు. ప్రతి విద్యార్థి తప్పక మాత్రలు వేసుకోవాలని సూచించారు. 29న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పాఠశాల అభివృద్ధిలో పాఠశాల యాజమాన్య కమిటీల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. డీఈవో వెంట తెనాలి మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, జయంతిబాబు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు.

యడ్లపాడు: జిల్లాలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కొండవీడుకోట ప్రాంతాన్ని పర్యాటకుల సందర్శనకు శనివారం నుంచి అనుమతిస్తున్నట్లు నరసరావుపేట ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ వెంకట రమణ చెప్పారు. శుక్రవారం వెంకట రమణ మాట్లాడుతూ వాయుగుండం ప్రభావంతో వరుసగా మూడు రోజులపాటు వర్షాలు కురిశాయన్నారు. దీంతో కోట సందర్శనను నిలిపివేసినట్లు తెలిపారు. గురువారం వర్షాల కారణంగా కొండలపై నుంచి జారిపడిన చిన్న బండరాళ్లను తొలగించినట్లు వివరించారు. ఘాట్‌రోడ్డు, అలాగే కొండపై ఉన్న పురాతన కట్టడాల వద్ద ఎలాంటి అవాంతరాలు లేవని నిర్ధారించుకుని పర్యాటకుల్ని సందర్శనకు అనుమతి ఇస్తున్నామన్నారు. శనివారం నుంచి యథావిధిగా సందర్శకులు రావచ్చని తెలిపారు.

తెనాలిరూరల్‌: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన యువకుడు చీకటి గోపి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ బృంద సభ్యులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం విచారణ జరిపారు. గోపికి చికిత్స చేసిన వైద్యులు, సిబ్బంది నుంచి వివరణ తీసుకున్నారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సౌభాగ్యవాణి, సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌, ఇతర వైద్యుల నుంచి వివరాలను సిట్‌ సభ్యులు గుంటూరు ట్రాఫిక్‌ సీఐ డి. కోటేశ్వరరావు. పొన్నూరు రూరల్‌ సీఐ కృష్ణయ్య నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement