నరసరావుపేట: జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24గంటల వ్యవధిలో 590.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మొత్తం 28మండలాలకు గాను 20 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చిలకలూరిపేటలో 94.2 మి.మీ వర్షం పడగా అత్యల్పంగా పిడుగురాళ్లలో 2.0 కురిసింది. యడ్లపాడులో 50.6, నాదెండ్ల 78.4, ముప్పాళ్ల 22.6, నరసరావుపేట 8.0, రొంపిచర్ల 82.6, ఈపూరు 11.6, నూజెండ్ల 46.8, వినుకొండ 4.2, నకరికల్లు 54.6, రాజుపాలెం 10.6, సత్తెనపల్లి 30.6, పిడుగురాళ్ల 35.4, అమరావతి 6.8, క్రోసూరు 10.6, అచ్చంపేట 4.2, బెల్లంకొండ 7.2, మాచవరం 20.4, కారెంపూడి 8.4 మి.మీ వర్షం కురిసింది.
చిలకలూరిపేటటౌన్: మట్టి కుప్పను ఢీకొని కారు పల్టీలు కొట్టడంతో ఇద్దరు గాయపడిన ఘటన అన్నంభోట్లవారిపాలెం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..చీరాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న మట్టి కుప్పను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. ప్రమాద సమయంలో కారులో హైదరాబాద్‌కు చెందిన వారు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడపడం వల్లే కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు, క్షతగాత్రుల పరిస్థితులు వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
చిలకలూరిపేట టౌన్: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఒంగోలు సమీపంలోని ఈతముక్కల ప్రాంతానికి చెందిన వూట్ల రాజేశ్వరి (24) కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను ప్రతివారం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం చికిత్స పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులతో ఆటోలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. చిలకలూరిపేట సమీపంలోని పోలిరెడ్డిపాలెం బైపాస్ వంతెన వద్ద ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో రాజేశ్వరితో పాటు మరో భర్త అశోక్, వృద్ధురాలు మర్రిపూడి సుశీలకు గాయాలయ్యాయి. వీరిలో సుశీల తీవ్రంగా గాయపడింది. డ్రైవర్‌కు నిద్రమత్తుతో ఇబ్బంది పడుతుండగా అశోక్ తనకు డ్రైవింగ్ వచ్చని చెప్పి కొద్దిదూరం ఆటో నడిపేందుకు ప్రయత్నించాడు. పోలిరెడ్డిపాలెం బ్రిడ్జి వద్దకు చేరుకున్న సమయంలో బైపాస్‌పై కొనసాగాలా.. సర్వీసు రోడ్డులోకి దిగాలా అనే విషయంలో అశోక్ అయోమయానికి గురయ్యాడు. అప్పుడే వాహనంపై నియంత్రణ కోల్పోయి వెంటనే బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. 108 సిబ్బంది వెళ్లి గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


