ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ
విద్యార్థులకు రూ.45 లక్షల
ఉపకార వేతనాలు పంపిణీ
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలో విద్యాభివృద్ధికి ఉపకార వేతనాలను పంపిణీ చేయడం ద్వారా ఆవోపా చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. ఆదివారం మార్కెట్ సెంటర్లోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(ఆవోపా) ఏపీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 220 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.45 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షుడు తడవర్తి రాంబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆకే రవికృష్ణ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం చేసే ప్రయత్నం ఎంతో గొప్పదని అన్నారు. క్రేన్ గ్రూప్ అధినేత జీవీఎస్‌ఎల్ కాంతారావు మాట్లాడుతూ చదువుతో జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాన్ని నేర్చుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో తల్లిదండ్రులను అనాథలుగా మార్చడం తగదని, సంస్కారం లేని విద్య వ్యర్థం అన్నారు. తెనాలి డబుల్ హార్స్ సీఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. ఆవోపా నగర అధ్యక్షుడు కేవీ బ్రహ్మం, కృష్ణ సాయి గ్రానైట్స్ ఎండీ ఎస్.హనుమంతరావు, ఆవోపా జాతీయ అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఆవోపా రాష్ట్ర అధ్యక్షుడు పి.కనకరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచపూడి సుబ్బారావు, గార్లపాటి సత్యనారాయణ, నంబూరు శివనాగేశ్వరరావు, చింతా కృష్ణారావు, చిట్టం రమేష్, మలిపెద్ది నాగేశ్వరరావు, ఆరవేటి నిర్మల, కూరపాటి సత్యనారాయణ, ఒలివేటి కృష్ణ పాల్గొన్నారు.


