నకరికల్లు: రాష్ట్ర స్థాయి ఆట్యా–పాట్యా సబ్‌జూనియర్స్ పోటీల్లో పల్నాడు జిల్లా బాలబాలికల జట్లు రెండూ ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాయి. ఈనెల 12, 13 తేదీలలో 11వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ ఆట్యా–పాట్యా పోటీలు కర్నూలులో నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తూ తలపడ్డారు. పోటీల్లో పల్నాడు జిల్లా బాలికల, బాలుర జట్లు అత్యంత క్రీడాస్ఫూర్తిని చాటి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచాయని ఆట్యా–పాట్యా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వి.రోహిత్ జోయల్ తెలిపారు. బాలికల జట్టుకు జి.ఝాన్సీరాణి, బాలుర జట్టుకు చింతా పుల్లయ్య కోచ్‌లుగా వ్యవహరించారు. ఉత్తమ ప్రతిభను చాటిన క్రీడాకారులకు, కోచ్‌లకు అసోసియేషన్ రాష్ట్ర సీఈఓ ఆర్.దుర్గాప్రసాద్, కార్యదర్శి ఆర్.చరణ్, ట్రెజరర్ కృష్ణారెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు సీహెచ్.సామాజ్య్రం తదితరులు అభినందించారు.


