డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో కలెక్టర్
నరసరావుపేట: కౌలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా రైతులకు సత్వరమే బ్యాంకు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ జూన్ క్వార్టర్ సమావేశం నిర్వహించారు. దీనికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రధాన మంత్రి సురక్షిత భీమా యోజన (పీఎంఎస్‌బీవై) గురించి జిల్లాలోని ప్రజలకు అవగాహన కోసం బ్రాంచ్‌లలో పోస్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వివిధ సబ్సిడీ పథకాలపై కనీసం నెలకు రెండు రుణ మేళాలు నిర్వహించాలన్నారు. ఎక్కువ మంది లబ్ధిదారులకు రుణాలు అందించే విధంగా చూడాలని బ్యాంకర్లను కోరారు. ఈ ఏడాది జూన్ వరకు జరిగిన ప్రాధాన్యత, ఇతర రంగాల రుణ వితరణపై సమీక్షించారు. సాగు రంగానికి రూ.17,761 కోట్ల వార్షిక లక్ష్యానికిగాను జూన్ క్వార్టర్ నాటికి రూ.5,927.84 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.3,112 కోట్లకు గాను రూ.1,445 కోట్లు, ప్రాధాన్యత రంగానికి రూ.21,490 కోట్లకు రూ.7,445 కోట్లు, ఏసీపీకి రూ.25,879 కోట్లకు రూ.9,086 కోట్లు లక్ష్యం సాధించినట్లు పేర్కొన్నారు. ఎల్‌డీఎం కేఎస్ రామ్‌ప్రసాద్, కన్వీనర్ డి.లక్ష్మీనారాయణ, యూబీఐ రీజినల్ హెడ్, నాబార్డు డీడీఎం శరత్, ఆర్‌బీఐ ఎల్‌డీఓ రామకృష్ణ, బ్యాంక్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


