రేషన్‌ మాఫియాలో అంతర్గత పోరు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ మాఫియాలో అంతర్గత పోరు

Sep 9 2026 3:04 AM | Updated on Sep 9 2026 3:04 AM

రేషన్‌ మాఫియాలో అంతర్గత పోరు

పేదల బియ్యం తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న మరో ముఠా వెంబడించి అక్రమ రేషన్‌ డ్రైవర్‌పై దాడి తప్పించుకునే క్రమంలో వాహనదారులను ఢీకొన్న డ్రైవర్‌ బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి రేషన్‌బియ్యం అక్రమ తరలింపు వ్యవహారం సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఇరువర్గాలతో రాజీ యత్నాలు చేపట్టిన టీడీపీ నేత

నరసరావుపేట టౌన్‌: పల్నాడు జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం అంతర్గత పోరుకు దారి తీసింది. పేదలకు అందించాల్సిన రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మరో రేషన్‌ మాఫియా అడ్డుకొని దాడికి పాల్పడింది. వారి నుంచి డ్రైవర్‌ తప్పించుకునే క్రమంలో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టటం కలకలంరేపింది. సంఘటనలో గాయపడ్డ వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అక్రమ రేషన్‌ మాఫియా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాలు ప్రకారం.. ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు సోమవారం నరసరావుపేటలో రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి వాహనంలో అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న పట్టణానికి చెందిన రేషన్‌ మాఫియా సభ్యులు నాలుగు మోటార్‌ సైకిళ్ల పై కోట సెంటర్‌ వద్దకు చేరుకొని వాహనాన్ని వెంబడించారు. ఒక చోట వాహనాన్ని అడ్డగించి డ్రైవర్‌పై దాడికి యత్నించినట్లు తెలిసింది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్‌ ఇరువురు ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టాడు. అనంతరం వాహనం వేగంగా నడుపుకుంటు అక్రమ రేషన్‌ బియ్యంతో డ్రైవర్‌ పారిపోయాడు. ఈ ఘటన మొత్తం స్థానిక సీసీ కెమెరాలలో నిక్షిప్తమైంది. అక్రమ రేషన్‌ వాహనాన్ని అడ్డుకోవటంతో మొదలైన వ్యవహారం పల్నాడు జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ కొనుగోళ్లు, తరలింపుల వెనుక ఉన్న వర్గాల మధ్య అంతర్గత పోరును బయటపెట్టింది. పేదలకు అందాల్సిన బియ్యం ప్రతినెలా యథేచ్చగా అక్రమంగా తరలి వెళ్తుతుందనటానికి ఈ సంఘటన అద్దం పడుతుంది. అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి విచారణ చేపట్టితే రేషన్‌ మాఫియా అక్రమాలు బయటపడతాయి. ఈ వ్యవహారం బహిర్గతం కావటంతో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతొంది. కాగా రేషన్‌ అక్రమ రవాణాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement