చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌టెక్ ప్రతిష్టాత్మకమైన ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్‌నర్’ గుర్తింపు అందజేసింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మంగళవారం వైస్ చాన్సలర్ కృష్ణకిషోర్‌కు హెచ్‌సీఎల్‌టెక్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ విభాగ ప్రతినిధి రాజమురుగన్ అథిముత్తు నాడర్ ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్‌నర్’కు సంబంధించిన ప్రశంసాపత్రాన్ని అందజేశారు. హెచ్‌సీఎల్‌టెక్ సంస్థ తన ప్రశంసాపత్రంలో సాంకేతిక ప్రతిభావంతుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఇరువర్గాల ఉమ్మడి నిబద్ధతను ప్రత్యేకంగా అభినందించింది. ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్‌నర్’గా విజ్ఞాన్ యూనివర్సిటీతో కలిసి విద్యా రంగం– పరిశ్రమ మధ్య బలమైన వారధిని నిర్మిస్తున్నామని, విద్యార్థులు తమ నైపుణ్యాలను చాటుకుని వృత్తిపరమైన కెరీర్‌లో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, డీన్లు తదితరులు పాల్గొన్నారు.


