చరిత్ర సృష్టించిన వినుకొండ విద్యార్థిని
పిడుగురాళ్ల రూరల్: పల్నాడు చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కతమైంది. దశాబ్దాలుగా వైద్య విద్యకు అందనంత దూరంగా ఉన్న ఈ ప్రాంతవాసుల చిరకాల స్వప్నం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గురజాల నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిల కృషితో నేడు వాస్తవరూపం దాల్చింది. పిడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాల పర్వం అధికారికంగా ప్రారంభమైంది.
వైఎస్ జగన్ కృషితోనే సాకారం
వైద్య సేవల కోసం, వైద్య విద్య కోసం పల్నాడు ప్రజలు గుంటూరు, విజయవాడ, బెంగళూరు, చైన్నె, విశాఖపట్నం, హైదరాబాదు వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పల్నాడు ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పిడుగురాళ్ల మండలం, కామేపల్లి గ్రామంలో అత్యాధునిక వసతులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఈ ప్రాజెక్ట్ సాధనలో అప్పటి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. కామేపల్లిలో కాలేజీ ఏర్పాటు కోసం భూసేకరణ నుంచి ప్రభుత్వ అనుమతులు, నిధుల మంజూరు వరకు ప్రతి అడుగులోనూ ఆయన పట్టుదలగా శ్రమించారు. స్థానికంగా భవన నిర్మాణాలు వేగవంతం కావడంలోనూ, ఈ ప్రాజెక్ట్‌ను పల్నాడు గడ్డపై సాకారం చేయడంలోనూ ఆయన చూపిన నాయకత్వ పటిమ మరువలేనిది.
ముగిసిన కౌన్సెలింగ్
జాతీయ వైద్య కమిషన్ అనుమతులతో కౌన్సెలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. కౌన్సెలింగ్ ద్వారా తొలి విడతలో భాగంగా 22 మంది విద్యార్థులు పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాలు పొందారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయి.
పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి అడ్మిషన్ పొందడం ద్వారా వినుకొండ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఎస్.సన్నీ సరికొత్త చరిత్ర సృష్టించారు. వెనుకబడిన ప్రాంతంగా పేరున్న పల్నాడు గడ్డపైనే స్థానికంగా వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కడంతో విద్యార్థిని కుటుంబంలోనూ, పల్నాడు ప్రాంతంలోను హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


