రాజుపాలెం: పంట వైవిధ్యంతో ప్రకృతి వ్యవసాయం చేస్తే రైతుకు ఆరోగ్యం, ఆదాయంతోపాటు ఆనందం లభిస్తుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి అన్నారు. మండలంలోని రాజుపాలెం, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు గల్లా ప్రసాద్, గుర్రాల మల్లికార్జున్‌ల పొలాలను ఆమె సోమవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మూడేళ్లుగా ఖరీఫ్‌కు ముందు పీఎండీఎస్ విధానంలో వివిధ రకాల విత్తనాలను సాగుచేస్తున్నట్లు తెలిపారు. రబీ అనంతరం డ్రైసోయింగ్ చేయడం వలన నేలలో సూక్మజీవుల చైతన్యం పెరిగి భూసారం పెరుగుతుందన్నారు. గల్లా ప్రసాద్ ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని, పొలంలోనే అన్ని వసతులతో కూడిన నివాసం ఏర్పాటు చేసుకుని కుటుంబసభ్యులంతా కలసి ప్రకృతి వ్యవసాయం చేయడం ఆనందదాయకం అన్నారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా క్షేత్రంలోని పంటలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. పండ్ల మొక్కలు, ఆకు కూరలు, కూరగాయలు, పూలు, సీజనల్ పంటలను కలిపి సాగు చేయడం వలన రైతులకు పంటల ద్వారా నిరంతరం ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని ఆదరించి రైతులను ప్రోత్సహించాలని కోరారు.


