పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వచ్చే అర్జీదారులతో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అధ్యక్షత వహించి 115 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా 24 అర్జీలు స్వీకరించగా వాటిలో గురజాల డివిజన్‌కు చెందిన నాలుగు అర్జీలు, సత్తెనపల్లి –10, నరసరావుపేట డివిజన్‌కు చెందినవి 10 ఉన్నాయి. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ నిర్వహించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ సమస్యల పరిష్కారంపై ఫీడ్‌బ్యాక్ అందించేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
అర్జీ పెట్టిన వెంటనే ట్రై సైకిల్..
స్థానిక లింగంగుంట్లకు చెందిన దివ్యాంగుడు రమేష్ తనకు ట్రై సైకిల్ మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ సమర్పించారు. రమేష్ నుంచి కలెక్టర్ స్వయంగా అర్జీని స్వీకరించి, వెంటనే సంబంధిత శాఖ అధికారుల ద్వారా ట్రై సైకిల్‌ను రమేష్‌కు అందజేశారు. జేసీ సంజనా సింహ, డీఆర్‌ఓ అద్దెయ్య, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


