సత్తెనపల్లి: పట్టపగలే చోరీ జరిగిన సంఘటన సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఫణిదం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కూచిపూడి రామారావు, మరియమ్మల గృహంలో సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో ఎవరు లేకపోవటంతో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మరియమ్మ డ్వాక్రా నగదు చెల్లించేందుకు వెళ్లడంతో ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మూడు సవర్ల బంగారు తాడు, మూడు సవర్ల రెండు బంగారు గాజులు, అరసవర రెండు చెవుల పోగులు, రూ.లక్ష నగదు అపహరించుకుపోయారు. డ్వాక్రా నగదు చెల్లించి ఇంటికి వచ్చిన మరియమ్మ ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి తన కుమారుడు కూచిపూడి సైమన్‌కు తెలిపింది. దీంతో సైమన్ సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నాదెండ్ల: పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితో దాడిచేసిన మరో యువకుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన కాకుమాను వేణుగోపాల్ చిలకలూరిపేట పండరీపురంలో నివాసం ఉంటూ అడ్డరోడ్డు సెంటర్‌లో కార్‌ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన పట్టపురాజు సాయి కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల వేణుగోపాల్ కుటుంబంపై సాయి అసభ్యంగా మాట్లాడాడు. ఈ విషయమై ఆదివారం సాయంత్రం గణపవరం జాతీయరహదారి టీమాక్స్ వద్ద ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సాయి తాను ముందుగా తెచ్చుకున్న కత్తితో వేణుగోపాల్‌పై దాడి చేశాడు. స్ధానికులు సాయిని పోలీసులకు అప్పగించారు. గాయాలపాలైన వేణుగోపాల్‌ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
రాజుపాలెం: పాలిమర్ గోతాల లోడుతో అతివేగంతో వెళుతున్న లారీ నెమలిపురి గ్రామంలో మలుపు వద్ద బోల్తాపడిన సంఘటన మండలంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారిపై నెమలిపురిలోని పోలేరమ్మ గుడి మలుపు వద్ద సోమవారం రాత్రి జరిగింది. గుజరాత్ నుంచి చైన్నె అతివేగంగా వెళుతున్న లారీ మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మణికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ సాయికృష్ణ, క్లీనర్ ఈశ్వర్ ఇద్దరు క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో ప్రొక్లెయిన్‌తో ఇరువురిని బయటకు తీసి 108 సహాయంతో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ సాయికృష్ణ(35) మృతిచెందాడు. ఇరువురు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారని ఎస్‌ఐ తెలిపారు.
రాజుపాలెం: అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు షాపులో ఇరువురు యువకులు ఘర్షణ పడగా ఒక యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని అనుపాలెం బస్టాండ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న బెల్టు షాపులో సోమవారం జరిగింది. టీడీపీ కార్యకర్త ఆలా రామయ్య కొంత కాలం నుంచి బెల్టు షాపును అక్రమంగా నడుపుతున్నాడు. షాపులోనే సిటింగ్ ఏర్పాటు చేశాడు. నిత్యం మందుబాబులు షాపులో తాగుతుంటారు. అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రోజులాగనే అనుపాలేనికి చెందిన కుంటా సైదారావు, అంచులవారిపాలెంకు చెందిన అంచుల గోపిలు బెల్టు షాపులో మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఇరువురి మద్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఉన్నపళంగా అంచుల గోపి కుంటా సైదారావును బీరు సీసాతో మెడమీద పొడవడంతో సృహతప్పి పడిపోయాడు. బంధువులు హుటాహుటీన 108 సహాయంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బస్టాండ్ సెంటర్‌లో బెల్టు షాపు నిర్వహించవద్దని గ్రామస్తులు ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.


