నరసరావుపేట రూరల్: రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్‌లో టెన్నిస్ డబుల్స్ విభాగంలో జిల్లా హోంగార్డ్ ఆర్‌ఐ(అడ్మిన్) ఎస్.కృష్ణ కాంస్య పతకం సాధించారు. ఈనెల 1నుంచి 4వ తేదీ వరకు అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో కృష్ణ ప్రతిభ కనభర్చి ద్వితీయస్ధానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పతకం సాధించిన ఆర్‌ఐ కృష్ణను అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనభర్చి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరుకు తీసుకువచ్చారని ప్రశంసించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
నరసరావుపేట: చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలో ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన వ్యక్తి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి ఏడుగురి పేరుపై ఉన్న ప్రభుత్వం భూమిని ఆక్రమించి రూ.10కోట్లకు విక్రయించారని పల్నాడు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు, జనతా వారధి జిల్లా కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు, నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌ఓ కె.అద్దెయ్యకు వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్ ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని, మున్సిపల్ కార్యాలయం ద్వారా ఇంటి పన్ను వేయించి చిలకలూరిపేట సబ్ రిజిస్టర్‌ని మేనేజ్ చేసి సర్వే నెంబరు 138/1 ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించారన్నారు. కొన్నవారు మరల అమ్మకానికి చూపగా అది ప్రభుత్వ భూమి అంటూ అందులో ఉన్న భవనాలు పడేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు అందరిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
వృద్ధురాలికి ప్రజాసంఘాల
నాయకుల పరామర్శ
చీరాల: వృద్ధురాలిపై టూటౌన్ సీఐ శశికుమార్ దురుసుగా ప్రవర్తించి అసభ్యపదజాలంతో దూషించిన ఘటనపై ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు, ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల నాయకులు స్పందించారు. సోమవారం ఆమె ఇంటికి వెళ్లి ఘటనకు సంబంధించి వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు.వారు మాట్లాడుతూ.. వృద్ధురాలిని అసభ్యంగా దూషించిన సీఐపై చర్యలు తీసుకోకుంటే ప్రజాసంఘాలతో కలిసి దశలవారీగా ఉద్యమిస్తామన్నారు. ఈ ఘటనతో వృద్ధురాలు తీవ్ర భయాందోళనకు గురైందని, పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం అత్యంత ఆందోళనకరమన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే సంయమనం పాటించకుండా దూషణలకు దిగడం సరికాదన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు చట్టాలకు అతీతులు కారని, టూటౌన్ సీఐపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.మోహన్‌కుమార్ ధర్మా, బలహీనవర్గాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శవనం శామ్యూల్, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ నాయకులు బి.లక్ష్మీనరసయ్య, డి.వందనం, వైహెచ్‌పిఎస్ నాయకులు మొగిలి ప్రతాప్, కె.ఉమాదేవి, మొగిలి శబరి, బ్రహ్మయ్య, పి.పోలయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.


