ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్‌

Sep 8 2026 1:35 AM | Updated on Sep 8 2026 1:35 AM

పది రోజుల వ్యవధిలో 22 ద్విచక్ర వాహనాలు చోరీ నిందితుడి నుంచి చోరీ సొత్తు స్వాధీనం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు

నరసరావుపేట టౌన్‌: పార్క్‌ చేసిన ద్విచక్రవాహనాలను టార్గెట్‌ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి రూ.14 లక్షల విలువైన 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. సోమవారం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. గత కొన్ని నెలలుగా నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ద్విచక్రవాహన చోరీలు అధికమయ్యాయన్నారు. దీంతో దొంగతనాల నివారణ కోసం వన్‌టౌన్‌ సీఐ ఫిరోజ్‌, ఎస్‌ఐ వంశీకృష్ణాలు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఆదివారం సాయంత్రం మొదటి రైల్వే గేటు వద్ద తనిఖీలు చేస్తుండగా నూజెండ్ల మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన యన్నాబత్తుని మణికంఠ ద్విచక్రవాహనంపై అనుమానస్పదంగా సంచరిస్తున్నాడన్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ద్విచక్రవాహన చోరీల వ్యవహారం వెలుగు చూసిందన్నారు. అత్యంత చాకచక్యంగా పది రోజలు వ్యవధిలోనే దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. పలు ప్రాంతాల్లో 22 ద్విచక్రవాహనాలు చోరీ చేసినట్లు నేరాన్ని అంగీకరించటంతో దొంగలించబడ్డ వాహనాలను నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు స్వాధీనం చేసుకున్నామన్నారు. వన్‌టౌన్‌లో 12, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒక కేసు మొత్తం 13 బైక్‌ చోరీ కేసుల్లో మణికంఠ నిందితుడిగా ఉన్నాడన్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో నేరాలు చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. నిందితుడు రిమాండ్‌కు వెళ్లిన తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారిస్తామన్నారు. నిందితుడిని పట్టుకోవటంలో ప్రతిభ కనపరిచిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిను అభినందించారు. వారికి రివార్డు ప్రకటించేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు.

16 వాహనాలు స్వాధీనం

బొల్లాపల్లి : ద్విచక్ర వాహనాల అపహరణకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించి, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వినుకొండ రూరల్‌ సీఐ బి బ్రహ్మయ్య తెలిపారు. బండ్లమోటు పోలీస్‌స్టేషన్‌ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. మండలంలోని పేరూరుపాడు పంచాయతీ కేశవానిపేట తండాకు చెందిన వడితే సర్తార్‌ నాయక్‌, కదలికలపై అనుమానంతో నిఘా ఉంచామని, నిందితుడిని సోమవారం సరికొండపాలెం తండా వద్ద అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. ఈ క్రమంలో పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల పరిధిలో వరుసగా మోటార్‌ బైకులు చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. సుమారు రూ.11 లక్షల విలువచేసే, 16 ద్విచక్ర వాహనాలను నిందితుని వద్ద స్వాధీనపరచుకుని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. నిందితుడిపై బండ్లమోటు స్టేషన్‌లో 11 కేసులు, దొనకొండ, తిరుమల 2వ పట్టణ, మాచర్ల పట్టణం, శావల్యాపురం పోలీస్‌స్టేషన్‌లలో ఒక్కొక్క కేసు నమోదైందని వివరించారు. నిందితుడిపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకోని వాహనాలు స్వాధీనపరచుకోవడంలో ప్రతిభ కనబరచిన బండ్లమోటు ఎస్‌ఐ సయ్యద్‌ షమీర్‌ బాషా, హెడ్‌ కానిస్టేబుళ్లు నాగరాజు, రమేష్‌, కానిస్టేబుల్లు ఇమ్రాన్‌ ఖాన్‌, కృష్ణమోహన్‌, సుమన్‌, గంగిరెడ్డి, లక్ష్మయ్యలను ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement