పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ఐద్వా జిల్లా కమిటీ నిరసన
నరసరావుపేట: నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పల్నాడు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం దుర్భరంగా మారుతుందన్నారు. కందిపప్పు, పంచదార, బియ్యం, ఉల్లిపాయలు, వంట నూనెల ధరలు పెరగడంతో కుటుంబాలపై ఆర్థిక భారం అధికమైందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో ప్రజలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని, కుటుంబ పోషణతో పాటు డ్వాక్రా రుణాలు, ఇతర అప్పులు తీర్చలేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై పన్నుల భారాన్ని తగ్గించాలని, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు అందించి పాత రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్.దుర్గాబాయి, జిల్లా కమిటీ సభ్యురాలు షేక్ ఆయేషా, పాల్గొన్నారు.


