వరుస చోరీలతో ప్రయాణికుల బెంబేలు సీ్త్రశక్తి పథకంతో అమాంతం పెరిగిన రద్దీ దొంగలకు అవకాశంగా మారిన కిక్కిరిసిన బస్టాండ్ పనిచేయని సీసీ కెమెరాలు బంగారం, నగదు, సెల్‌ఫోన్లే లక్ష్యం చోద్యం చూస్తున్న అధికారులు
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంగా మారింది. వరుసగా చోటుచేసుకుంటున్న చోరీలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయంలో, టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మహిళల రద్దీ పెరగడంతో దొంగలకు మరింత అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని నెలలుగా బస్టాండ్‌లో దొంగలు సెల్‌ఫోన్లు, నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్తున్నారు. బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్ల కోసం నిలబడినప్పుడు చేతివాటం ప్రదర్శించి అందినకాడికి కాజేస్తున్నారు.
నరసరావుపేట టౌన్: సీ్త్రశక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో బస్టాండ్ ప్రాంగణంతో పాటు బస్సుల్లోనూ కిక్కిరిసిన పరిస్థితి నెలకొంటోంది. దీనికి అనుగుణంగా భద్రత, నిఘా వ్యవస్థ, మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల బ్యాగులు, పర్సులు, సెల్‌ఫోన్లు, నగదుపై చోరులు కన్నేసి, పథకం ప్రకారం కొల్లగొడుతున్నారు. గత ఆదివారం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి బ్యాగులో ఉన్న 12 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. రద్దీని దొంగలు ఎంతగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారో ఈ ఘటన అద్దం పడుతోంది.
కెమెరాలు ఉన్నా ప్రయోజనం శూన్యం
బస్టాండ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిలో కొన్ని పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. చోరీ జరిగిన సమయంలో నిందితులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీ కీలకం. అయితే కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సైతం కష్టతరంగా మారింది. కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించడంతో పాటు కీలక ప్రాంతాల్లో అదనపు కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బుకింగ్ కౌంటర్లు, బస్సులు ఎక్కే ప్రదేశాలు, ప్లాట్‌ఫారాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను పూర్తిస్థాయిలో నిఘా పరిధిలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కీలక కేంద్రం
నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ పల్నాడు జిల్లా కేంద్రమే కాకుండా, రాయలసీమ ప్రాంతాలతో పాటు హైదరాబాద్, విజయవాడ, శ్రీశైలం తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు కీలక కేంద్రంగా ఉంది. రోజూ వేలాది మంది ప్రయాణాల కోసం బస్టాండ్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇంతటి రద్దీ ఉన్న బస్టాండ్‌లో ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది.
సమన్వయ లోపం
చోరీలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పర్యవేక్షించడం, రద్దీ సమయాల్లో పోలీసు లేదా సెక్యూరిటీ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని నిరంతరం పరిశీలించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చోరీలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేసుల నమోదు, దర్యాప్తు, నిందితుల గుర్తింపు కోసం ఆర్టీసీ, పోలీసు శాఖలు సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. చోరీలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే వాటిని అరికట్టేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. సీసీ కెమెరాలను తక్షణమే బాగుచేసి, రద్దీ ప్రాంతాల్లో నిఘాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా తగిన సిబ్బందితో ఇక్కడ నిఘా పెట్టి నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పోలీసు ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సులు సరిపడా లేక అవస్థలు పడుతున్న తమకు ఈ చోరులతో ఆందోళన తప్పడం లేదని వాపోతున్నారు.


