గిరిజనుల విద్యాభివృద్ధిలో సుజాత సేవలకు గుర్తింపు
మాచర్ల రూరల్: గిరిజన చిన్నారుల చేత బలపం పట్టించి అక్షరాలు దిద్దించి, వారి ఉన్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ గిరిజన విద్యార్థుల్లో సంకోచాన్ని తొలగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటంలో ఆ ఉపాధ్యాయురాలు సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేసింది. మాచర్ల మండలం ఎత్తిపోతల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న మారుబోయిన సుజాతకు అరుదైన గౌరవం దక్కింది. 2012 డీఎస్సీ ద్వారా ఎస్‌ఎగా భౌతిక శాస్త్రం ఉపాధ్యాయురాలుగా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు, మురికిమళ్ల తండాలో విధుల్లో చేరారు. ఉపాధ్యాయురాలుగా నూరుశాతం ఉత్తీర్ణత సాధిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో చొరవచూపి తల్లిదండ్రుల విశ్వాసాన్ని సంపాదించారు. అక్టోబర్‌లో అంతర్‌జిల్లా బదిలీ ద్వారా పల్నాడుకు వచ్చి శిరిగిరిపాడు పాఠశాలలో పనిచేశారు. అక్కడ విద్యార్థులకు సైన్స్‌లో టాలెంట్ టెస్టులు, ప్రయోగశాలలు ఏర్పాటు చేసి కలెక్టర్ ద్వారా మెరిట్ సర్టిఫికెట్లను అందుకున్నారు. ముఖ్యంగా బడి మానేసిన విద్యార్థులను బడికి తీసుకురావటంతో పాటు, ఆరోగ్య సమస్యలతో పాటు బాధపడుతున్న వారికి సొంత ఖర్చులతో వైద్యం అందించి చిన్నారుల మనసు గెలుచుకున్నారు. వెల్దుర్తి మండల సైన్స్ అధికారిగా జిల్లా స్థాయిలో సైన్స్ కార్యక్రమం నిర్వహించి అవార్డు అందుకున్నారు. సైన్స్ పట్ల విద్యార్ధుల్లోని భయాన్ని పోగొట్టి వారికి సులభమైన రీతిలో ప్రయోగాల ద్వారా విద్యనందించటంలో ఆమె ప్రతిభను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు.


