లోకేష్‌ పర్యటన.. ప్రజలకు నరకయాతన | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ పర్యటన.. ప్రజలకు నరకయాతన

Sep 3 2026 4:03 AM | Updated on Sep 3 2026 4:03 AM

మంత్రి రాకకోసం అధికారుల అత్యుత్సాహం

పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్‌ అంక్షలు

మల్లమ్మ సెంటర్‌కు మార్గాల మూసివేత

ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ కష్టాలు

గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకొని ప్రజల ఇక్కట్లు

నరసరావుపేట టౌన్‌: మంత్రి నారా లోకేష్‌ పర్యటన నరసరావుపేట ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కాకాని గ్రామం వద్ద ఉన్న జేఎన్‌టీయూ కళాశాల హాస్టల్‌ భవన ప్రారంభోత్సవానికి బుధవారం మంత్రి హాజరయ్యారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు పట్టణంలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీంతో ప్రయాణికులతో పాటు రోజు వారీ పనులకు వెళ్లే ప్రజానీకం నరకయాతన అనుభవించారు. చిలకలూరిపేట రోడ్డు నుంచి మల్లమ్మ సెంటర్‌ మీదుగా లోకేష్‌ ర్యాలీగా రావటంతో మల్లమ్మ సెంటర్‌లో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పట్టణంలోకి ప్రవేశించేందుకు ఉన్న నాలుగువైపుల మార్గాలకు బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీస్‌ శాఖ రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి మల్లమ్మ సెంటర్‌ మీదుగా గుంటూరు, సత్తెనపల్లి మార్గాలకు వెళ్లే బస్సుల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్న మార్గాల్లోనూ ట్రాఫిక్‌ స్తంభించి పోవటంతో వాహనాలు గంటల తరబడి ముందుకు కదలలేదు. దీంతో రోడ్లపైనే ప్రయాణికులు ఉండిపోయారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, అత్యవసర పనులపై ఆసుపత్రులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ అంక్షలు అమలు చేసే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్దం చేయాల్సిన అధికారులు ఆదిశగా ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వినిపించాయి.

మంత్రి మెప్పు కోసం ఆరాటం..

మంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా వ్యవహరించలేదు. మంత్రి కాన్వాయ్‌ సాఫీగా వెళ్లేందుకు ప్రధాన రహదారులను గంటలతరబడి నిలిపివేశారు. ప్రజాప్రతినిధుల రాకపోకల కోసం రవాణా వ్యవస్థను పూర్తిగా స్థభింపచేయటం సరైన పద్దతి కాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయకపోవటంతో సమస్య తలెత్తింది. ట్రాఫిక్‌ ఆంక్షల సమయంలో అంబులెన్స్‌లు, అత్యవసర వైద్యసేవలకు వెళ్లే వారి పరిస్థితి ఏంటన్నా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కీలకమైన ఓవర్‌బ్రిడ్జి మార్గాన్ని పూర్తిగా నిలిపివేయటంతో సత్తెనపల్లి, గుంటూరు వెళ్లే వారు రెండు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు ఓవర్‌బ్రిడ్జి మూసివేత.. మరోవైపు మంత్రి ర్యాలీ.. ఇంకో వైపు ప్రత్యామ్నయ మార్గంలో వాహనాల రద్దీతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement