ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కె.నాగేంద్రబాబు
చిలకలూరిపేట(యడ్లపాడు): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం పట్టణంలోని ఆర్‌వీఎస్‌సీవీఎస్ హైస్కూల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షించాలని సూచించారు. చిలకలూరిపేటలో రూ.3 కోట్లతో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ కృష్ణప్రియ పాల్గొన్నారు.
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
సత్తెనపల్లి: పట్టణంలోని గుంటూరు బస్‌స్టాప్ సెంటర్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెంది ఉండడాన్ని పట్టణ పోలీసులు గుర్తించారు. మృతుని వయసు సుమారు 70 ఏళ్ల వరకు ఉంటుందని, తెల్లచొక్కా ధరించి ఉన్నాడన్నారు. మృతుని ఆచూకీ తెలిసినవారు సత్తెనపల్లి టౌన్ పోలీస్‌స్టేషన్ లేదా సీఐ 9440796230 నంబర్‌కు సమాచారం తెలియ చేయాలని పట్టణ ఎస్‌ఐ పీ.పవన్‌కుమార్ బుధవారం తెలిపారు.
చీకటి గోపి మృతిపై కేసు నమోదు
తాడికొండ: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపిని కేసు విచారణలో భాగంగా తాడికొండ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కొట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. కేసు విచారణాధికారిగా మేడికొండూరు సీఐ మధుసూధనరావును నియమించడంతో ఆయన పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన తాడికొండ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతుడి ఒంటిపై ఉన్న గాయాలకు కారణాలు ఏంటి అనే విషయాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజీలను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా తెనాలిలో అవినీతి ఆరోపణలు ఎదుక్కొని వీఆర్‌లో ఉంటూ తాడికొండకు పోస్టింగ్‌పై వచ్చిన ఓ కానిస్టేబుల్‌తో పాటు తాడికొండలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న మరో కానిస్టేబుల్ కేసు విచారణలో భాగంగా మృతుడిని కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం పూర్తి నివేదిక అంది విచారణ జరిగితే కానీ విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు.
పోస్టుమార్టం ప్రక్రియ వీడియో రికార్డింగ్
గుంటూరు మెడికల్: చోరీ కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి గుంటూరు జీజీహెచ్‌లో మంగళవారం మృతిచెందడంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌లో ఆందోళన చేసిన విషయం విధితమే. పోలీసుల లాఠీ చార్జి వల్లే గోపి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించడంతో బుధవారం గోపి పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పూర్తి చేశారు.


