డీసీహెచ్‌ఎస్ రంగారావు
ఈపూరు: విధులకు వరుసగా పది రోజులు గైర్హాజరైతే ఇంటికి వెళ్లాల్సి వస్తుందని ఉమ్మడి గుంటూరు జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి (డీసీహెచ్‌ఎస్) రంగారావు హెచ్చరించారు. ఈపూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలోని వార్డులు, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, రికార్డులను పరిశీలించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈపూరులో నిలిచిపోయిన ఆస్పత్రి భవన నిర్మాణ పనులను చూసి ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు చేపటతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న 500 మంది పీజీ చదువుల కోసం వెళ్లారని తెలిపారు. వినుకొండ, ఈపూరు పీహెచ్‌సీలో గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్ వైద్యులను సర్దుబాటు చేస్తున్నామని అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో వైద్యులను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. వినుకొండ, సత్తెనపల్లి, బాపట్లలకు డయాలసిస్ కేంద్రాలు మంజూరయ్యాయని, సత్తెనపల్లి, మాచర్లలో రక్తనిధి కేంద్రాలు ఏర్పాటుకు నిధులు విడుదలయ్యాయని చెప్పారు. వినుకొండలో 100 పడకల ఏరియా ఆసుపత్రి, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. నరసరావుపేటలో రూ.10 కోట్లతో 160 రకాల పరీక్షలు చేసే ఆధునిక ల్యాబ్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. గుండెపోటుకు గురైన వారికి టెనెక్ట్ ప్లస్ ఇంజక్షన్ అందించి ఇప్పటి వరకూ 625 మందిని ప్రాణాపాయం నుండి కాపాడినట్లు వెల్లడించారు. తనిఖీలో సూపరింటెంటెండ్ రేణుక, వైద్యులు వై.లక్ష్మి, అబ్దుల్ రజాక్ సిబ్బంది పాల్గొన్నారు.
పురుగుమందు తాగి సోదరులు ఆత్మహత్య
88త్యాళ్లూరు(క్రోసూరు): తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన సోదరులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్‌ఐ పి.రవిబాబు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. 88 త్యాళ్లూరు గ్రామానికి చెందిన లంకోటి ఆదిలక్ష్మి, రత్తయ్యల కుమారులు కోటేశ్వరరావు(25), సీతారామయ్యలు(24) కూలీ పనులకు వెళ్లే వారు. మద్యం సేవించి రాత్రి ఇంటికి రావటంతో తల్లి మందలించింది. మనస్థాపానికి గురైన సోదరులు ఇంట్లో ఉన్న పురుగుమందు కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించారు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కోటేశ్వరరావు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో మృతి చెందగా, సీతారామయ్యను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ వేకువజామున మృతి చెందాడు. మృతుడు కోటేశ్వరరావుకు భార్య, ఇద్దరు సంతానం కలరు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు తెలిపారు.
5న సత్తెనపల్లిలో జాబ్‌మేళా
సత్తెనపల్లి: స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ (ఏపీ ఎస్‌ఎస్‌డీసీ), సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 5న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు, సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.పద్మ మంగళవారం తెలిపారు. జాబ్‌మేళాకు టెక్ మహేంద్ర, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, టాటా ఎలక్ట్రానిక్స్, ఫోక్స్‌కాన్, ఎస్బీఐ కార్డ్స్ వంటి 11 రకాల కంపెనీలు హాజరవుతు న్నాయన్నారు. విద్యార్హతను బట్టి జీతం సుమారు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండవచ్చునన్నారు. జాబ్‌మేళాకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లమా, ఫార్మసీ, పీజీ విభాగాల వరకు చదువుకున్న 18– 35 సంవత్సరాల వయసుగల నిరుద్యోగ యువత బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చునన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. వివరాలకు రామకష్ణారెడ్డి– 80743 93466, అంజిరెడ్డి 77798 58789 నంబర్లలో సంప్ర దించాలన్నారు. ఔత్సాహికులు ముందుగా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోగలరన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిసర ప్రాంత యువతీ, యువకులు అందరూ ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


