యానిమేటర్‌పై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యానిమేటర్‌పై చర్యలు తీసుకోవాలి

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

యానిమేటర్‌పై చర్యలు తీసుకోవాలి

వెలుగు కార్యాలయం ముందు డ్వాక్రా సభ్యులు ధర్నా

అచ్చంపేట: తాము బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రతి నెలా తమ వద్ద నగదు వసూలు చేసి, బ్యాంకులో చెల్లించకుండా సొంతానికి వాడుకున్న యానిమేటర్‌ షేక్‌ సల్మాపై చర్యలు తీసుకోవాలని పలువురు డ్వాక్రా గ్రూపు సభ్యులు సోమవారం స్థానిక వెలుగు కార్యాలయం ముందు ధర్నా చేశారు.

రుణాలకు సంబంధించి తాము చెల్లించిన నగదును వెంటనే బ్యాంకులో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా కొనసాగించారు. సల్మాపై చర్యలు తీసుకోవాలని, వెలుగు అధికారులు తమ గోడు విని వెంటనే స్పందించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజనం కూడా కార్యాలయం ముందే చేశారు. నష్టపోయిన జానీ, శివసాయి, తిరుమల, ప్రియాంక, మక్కా మసీద్‌, అజ్మీత్‌ డ్వాక్రా గ్రూపు సభ్యులకు మద్దతుగా కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కమిటీ సభ్యుడు హనుమంతరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కత్తుల గోపీకృష్ణారెడ్డి మద్దతు తెలిపారు.

న్యాయం దక్కలేదనే...

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ దీనిపై తాము జూలై 8న అచ్చంపేట వెలుగు కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. అక్కడ తమకు న్యాయం జరగకపోవడంతో గత నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వెలుగు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఎక్కడా తమకు న్యాయం జరగకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో తాము ధర్నాకు దిగాల్సి వచ్చిందని వాపోయారు. సుమారు రూ.35 లక్షలకు పైగా సల్మా మోసం చేసినట్లు ఆరోపించారు. తక్షణమే విచారణ జరిపి, తాము చెల్లించిన సొమ్మును యానిమేటర్‌ వద్ద రికవరీ చేసి బ్యాంకులో జమ చేయాలని, అప్పటి వరకు తాము ధర్నా విరమించేది లేదని తెలిపారు. వెలుగు కార్యాలయం ప్రధాన తలుపులను మూసేసి, ఎవ్వరినీ కార్యాలయంలోకి వెళ్లనీయకుండా దారికి అడ్డంగా కూర్చున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో వెలుగు ఏపీఎం వెంకటరెడ్డి పోలీసులతో వచ్చి జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టి, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో డ్వాక్రా సభ్యులు ఎల్లమంద, మల్లేశ్వరి, తిరుపతమ్మ, కుంభా పార్వతి, గౌరి, పార్వతి, పుల్లమ్మ, కోటేశ్వరి, అచ్చమ్మ, ఏపూరి మల్లేశ్వరి, కోటేశ్వరి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement