ఏపీ జేఏసీ అమరావతి నేతలు బొప్పరాజుపై వ్యాఖ్యలకు ఖండన కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పణ
నరసరావుపేట: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ జేఏసీ సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సీపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్‌ను వెంటనే అమలు చేయాలని, పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే ప్రకటించాలని, ఐదు డీఏలు అందజేసి ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు ఎస్. నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో తమ డిమాండ్లకు మద్దతు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు. మిగిలిన వాటిని అమలు చేయకుండా ఉండటం భావ్యం కాదని అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బాకీ ఉందని పేర్కొన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాడుతామని హెచ్చరించారు. నేటి నుంచి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడాన్ని రాజకీయ కోణంలో చూడటం, ఉద్యమాన్ని వక్రీకరించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులపై విమర్శల వల్ల సమస్యలు పరిష్కారం కావని గుర్తుచేశారు. ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లుపై పాలకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


