డీఎంహెచ్‌ఓ డాక్టర్ రత్నమన్మోహన్
పిడుగురాళ్ల రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పుల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ రత్నమన్మోహన్ స్పష్టం చేశారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించి, వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలోని రికార్డులు, మందుల నిల్వలు, ఓపీ సేవలను డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రతి గర్భిణీకి సక్రమంగా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇంటి ప్రసవాలను పూర్తిగా నివారించి, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. స్థానిక వైద్యులు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ రమాదేవి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల సమస్యలపై
నిరంతర పోరాటం
వినుకొండ: రాష్ట్ర విద్యార్థి యువసేన ఉమ్మడి గుంటూరు జిల్లా మహాసభ వినుకొండలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంపెంగుల రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అనుమతులు లేకుండా, డమ్మీ భవనాలు చూపిస్తూ అక్రమంగా నడుస్తున్న కళాశాలలపై త్వరలోనే ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులను భయపెట్టి అక్రమ ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించడంలో విజయం సాధించామని పేర్కొన్న ఆయన.. రాబోయే రోజుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్, సంక్షేమ హాస్టళ్ల సమస్యలు మరియు జీవో నెంబర్ 77 రద్దు కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎం.యేసుబాబు, ఆర్.రాజు, వి.కోటేశ్వరరావు, కె.ఆంజనేయులు తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
తొలగించిన షిప్ట్ ఆపరేటర్లను విధుల్లోకి తీసుకోవాలి
పీజీఆర్‌ఎస్‌లో అధికారులను కోరిన ఏఐటీయూసీ నాయకులు
నరసరావుపేట: వినుకొండ నియోజకవర్గంలో విద్యుత్ ఉపకేంద్రాలలో పనిచేస్తున్న 19 మంది షిఫ్ట్ ఆపరేటర్లను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా అకారణంగా తొలగించారని, వారందరిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) నాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కార్యదర్శి పిశ్రీనివాసరావు ఆధ్వర్యంలో డీఆర్‌ఓ అద్దెయ్యకు వినతిపత్రం సమర్పించారు. సమస్యను పరిష్కరించాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ షేక్ సుభానీని డీఆర్‌ఓ ఆదేశించారు. తొలగించిన కార్మికులు పాల్గొన్నారు.
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
అమరావతి: మండల పరిధిలోని మునగోడు శివారు గ్రామమైన తురగావారి పాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామానికి చెందిన తాల్లూరి సూర్యప్రకాష్ అమరావతి నుంచి పెదపాలెంకు తన ద్విచక్ర వాహానంపై వెళుతూ మార్గంమధ్యలో తురగావారిపాలెం వద్ద గేదెలు తోలుకుని వెళుతున్న బయ్యవరం గ్రామానికి చెందిన శిరసాని శ్రీనివాసరావు(56)ను ఢీకొట్టాడు. ఈసంఘటనలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడి వైద్యలు పరీక్షలు చేసి శ్రీనివాసరావు మృతి చెందాడని నిర్ధారించారు. ఈ సంఘటన పై అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


